కళాశాల సీజ్.. ప్రశ్నర్థకంగా విద్యార్థుల భవిష్యత్తు..

by Sumithra |
కళాశాల సీజ్.. ప్రశ్నర్థకంగా విద్యార్థుల భవిష్యత్తు..
X

దిశ, కుత్బుల్లాపూర్ : అధికారుల అవినీతి ధోరణికి విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎస్ఆర్ బాయ్స్ రెసిడెంట్స్ జూనియర్ కళాశాలకు నిబంధనల ప్రకారం అనుమతి రాకూడదు. కానీ ఇంటర్మీడియట్ విద్యాబోర్డు అధికారులు కళ్లు మూసుకుని బాచుపల్లిలో పత్తికుంట చెరువును ఆక్రమించి భవంతి నిర్మాణం జరిగినప్పటికి అనుమతులు మంజూరు చేశారు. దీంతో నేడు సుమారు 500 మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడేలా చేసింది. భవంతి నిర్మాణం ఎలా ఉంది, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఏమైనా నిర్మించారా.. భవంతికి ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ ఉందా లేదా అని ప్రాథమిక విచారణ చేపట్టకుండా కార్యాలయంలో కూర్చుని కాసులకు కక్కుర్తి పడి అనుమతులు ఇవ్వడం, నేడు అదే భవంతి సెల్లార్ లోకి భారీగా వరద నీరు చేరడం హాట్ టాఫిక్ గా మారింది. స్థానికుల ఫిర్యాదుతో కదిలిన మునిసిపల్ అధికారులు భవంతిలోకి భారీగా వరద వచ్చి చేరుతుందని, పిల్లలు ఇక్కడ చదవడం ప్రమాదానికి సాంకేతంగా భావించి భవంతిని మంగళవారం అధికారులు సీజ్ చేశారు.

నీటి పారుదల శాఖ రికార్డులు ప్రకారం..

బాచుపల్లి గ్రామ సర్వే నెంబర్ 283లో ఏకరాలు 13:23 గుంటలలో పత్తికుంట ఉంది. ఈ కుంటను చెరబట్టిన కొందరు భారీ స్థాయిలో భవంతులు నిర్మించారు. కుంట ఎఫ్టీఎల్, బఫర్ వరద నాలాలలో ఎస్ఆర్ కళాశాల భవంతితో పాటు, డిమార్ట్ బిల్డింగ్, సప్తపది, శ్రీరామ్ స్కూల్ బిల్డింగ్ నిర్మించారు. అప్పటి గ్రామ పంచాయితీ పాలకులు, అధికారులు కాసులకు ఆశపడి అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహించారు. దీంతో భారీ వర్షాలు పడ్డ ప్రతి సారి ఈ నిర్మాణాలలోకి వరద నీరు చేరడం సర్వ సాధారణంగా అయ్యింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ భవంతులకు వచ్చే సంవత్సరం నుండి విద్యాశాఖ రెన్యువల్ అనుమతులు ఇవ్వకూడదని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

పత్తికుంట ఆక్రమణల పై హైడ్రా చర్యలు తీసుకోవాలి... నిజాంపేట్ బీజేపీ శాఖ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీష్..

బాచుపల్లి పత్తికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లను ఆక్రమించి ఎస్ఆర్ జూనియర్ కళాశాల, సప్తపది గార్డెన్స్, డిమార్ట్ నిర్మాణం చేపట్టారు. వీటి పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి హైడ్రా అధికారులు ఆయా భవంతుల పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిచో ఇలాంటి వరద సమస్యలు ప్రతి ఏడాది పునరావృతం అయ్యి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందంటున్నారు.

అన్నీ చూసే కళాశాల అనుమతులు ఇచ్చాం.. మేడ్చల్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి కిషన్...

బాచుపల్లి ఎస్ఆర్ జూనియర్ రెసిడెన్సీ కళాశాల అనుమతులను అన్నిపత్రాలు సరి చూశాకే ఇచ్చాము. ఫైర్ సేఫ్టీ, ఇరిగేషన్ ఎన్ఓసీ, శానిటేషన్ ఎన్ ఓ సీ, బిల్డింగ్ స్టాండర్డ్ సర్టిఫికెట్ అన్ని ఒరిజినల్స్ చూశాకే జూనియర్ కళాశాలలకు అనుమతులు ఇచ్చాము. ఇతర శాఖల తప్పిదాలకు మా శాఖ బాధ్యత వహించదు. అయినా మళ్ళీ రీ ఎంక్వైరీ చేసి పత్రాలు సరి చూసి అనుమతులు పునరుద్దరిస్తాం అంటున్నారు అధికారులు.

Advertisement

Next Story

Most Viewed