స్పౌజ్ బది‘లీలలు’.. నిబంధనలకు తూట్లు

by Aamani |
స్పౌజ్ బది‘లీలలు’.. నిబంధనలకు తూట్లు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ఉపాధ్యాయ బదిలీల్లో స్పౌజ్ వివాదం ముదురుతోంది.స్పౌజ్ బదిలీ పాయింట్ల దుర్వినియోగంపై దూమారం చెలరేగుతోంది.టీచర్ల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు డీఈవో దృష్టికి తీసుకెళ్లిన పరిష్కరించడం లేదు ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ట్రాన్స్ ఫర్లను పారదర్శకంగా చేపడుతున్నామని మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నా స్పౌజ్ బదిలీ పాయింట్ల లో అక్రమాలు, తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి అవకతవకలపై చేసిన ఫిర్యాదులను తక్షణమే సరిదిద్దాల్సి ఉన్నా ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడం తో బదిలీ ప్రక్రియలో అర్హులకు అన్యాయం జరుగుతుందని టీచర్ల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్పౌజ్ పాయింట్ల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ (జేఏసీ) ధర్నాకు పిలుపునిచ్చింది.

నిబంధనలు బేఖాతరు..

స్పౌజ్ బదిలీల కోసం జూన్ లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆన్ లైన్ లో ఆప్షన్ లు పెట్టుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్ జిల్లాలో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఆప్షన్లు పెట్టుకున్నారు.స్పౌజ్ పాయింట్లు తీసుకునే వారు స్పౌజ్ పాయింట్ల రేడియస్ లోనే బదిలీ స్థానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వారు కోరుకున్న చోట్ల ఖాళీ లేకపోతే పక్క మండలాలు, ఆ తర్వాత మండలాలను ఎంపిక చేసుకోవచ్చు. అలా కాకుండా తమకు ఇష్టం ఉన్న మండలాలు, ప్రాంతాలకు వెళ్లేలా ఆప్షన్ లు ఇవ్వడం,అధికారులు పరిశీలించకుండానే ఆర్డర్లు ఇవ్వడంతో స్పౌజ్ పాయింట్ల నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగాయి.

అధిక జీతం కోసం అడ్డదారులు..

పిల్లలు నిజాయితీగా ఎదగాలని బోధించాల్సిన ఉపాధ్యాయులే అధిక జీతం కోసం అడ్డదారులు తొక్కారు. భార్య భర్తలైన ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో ట్రాన్స్ ఫర్, బదిలీల్లో ఆదనంగా 10 పాయింట్లు కేటాయించింది. భార్యభర్త ఇద్దరు పనిచేసే పాఠశాలలకు దగ్గరగా ఉండాలనే ఈ నిబంధన తెచ్చారు. అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియలో 10 పాయింట్స్ వారికి ప్రత్యేకంగా కేటాయిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కలిగించింది. కానీ ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యం పాయింట్లు పొందిన వారి తర్వాత భార్యభర్తలు ఎనిమిదేళ్లకు ఒకసారి ఎవరో ఒకరు మాత్రమే 10 పాయింట్లు వాడుకోవాలనే నిబంధన ఉంది. కానీ అందుకు విరుద్ధంగా మేడ్చల్ జిల్లాలో జరిగింది. స్పౌజ్ బదిలీల్లో భర్యాభర్త ఒకే మండలంలో పోస్టింగ్ కు దరఖాస్తు చేయాల్సి ఉండగా, కొందరు హెచ్ఆర్ఏ ఎక్కువ లభించే స్కూళ్లను ఆప్షన్ గా పెట్టుకున్నారు.

దీనికి స్పౌజ్ బదిలీ పాయింట్ల వినియోగానికి సంబంధమే లేదు. తద్వారా పై స్థాయిలో ఉన్న పలుకుబడి, పైరవీలతో తమకు నచ్చిన పాఠశాలలకు బదిలీ చేయించుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో జిల్లా విద్యాశాఖ 11 మంది ఉపాధ్యాయులపై ఎంఈఓలతో కమిటీ వేసి విచారణ చేయించింది. ఎంక్వైరీ రిపోర్టును డీఈవో విజయకుమారికి అందజేశారు. రిపోర్టు ఆధారంగా సదరు ఉపాధ్యాయులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ,మేడ్చల్ జిల్లా డీఈవో తాత్సరం చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

ఈ నెల 21న ధర్నా..

మేడ్చల్ జిల్లాలో స్పౌజ్ పాయింట్ల దుర్వినియోగం పై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నెల 21వ తేదీన ఉపాధ్యాయ (టీఎస్ యూటీఎఫ్,ఎస్ టీయూటీఎస్, టీపీయూఎస్, టీయూటీఎఫ్, టీపీఆర్ టీయూ, టీపీటీఎఫ్ సంఘాలు) జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నట్లు ఆయా సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం డీఈవో కార్యాలయంలో ఏడీ లింగానందంకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నోటీసులతో కూడిన వినతి పత్రం అందజేశారు. స్పౌజ్ బదిలీల పాయింట్ల దుర్వినియోగంపై సంబంధిత టీచర్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో సహా, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన ఎప్పటికీ ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత టీచర్లపై చర్యలు తీసుకోవడం లో జరుగుతున్న తాత్సరాన్ని నిరసిస్తూ ఈ నెల 21 పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు జయసింహ రెడ్డి( టీఎస్ యూటీఎఫ్),వెంకటేశ్వర్లు (ఎస్టీయూ టీఎస్), రాజ్ కుమార్ (టీపీయూఎస్ ), విఠల్( టీయూటీఎఫ్), బ్రహ్మచారి(టీపీటీఎఫ్) లు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story