నిజాంపేట్ లో మరో భూ కబ్జాకు స్కెచ్.. వెనకున్నది అతనేనా..?

by Kalyani |
నిజాంపేట్ లో మరో భూ కబ్జాకు స్కెచ్.. వెనకున్నది అతనేనా..?
X

దిశ, కుత్బుల్లాపూర్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మరో భూ కబ్జాకు స్కెచ్ రెడీ చేశారు. నిజాంపేట్ గ్రామ సర్వే నెంబర్ 191 లో గల (11 గుంటల స్థలం) సుమారు 1200 చదరపు గజాల స్థలం తమ వశం చేసుకునేందుకు పథకం రచించారు కబ్జా దారులు. ఇక్కడ కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలం విలువ సుమారు రూ. 10 కోట్లకు పైగా విలువ పలుకుతుంది. అయితే స్థానిక షాడో మేయర్ అండ దండలతో ఈ కబ్జాను బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ స్థలం మున్సిపల్ అవసరాల కోసం వినియోగించుకునేందుకు గత కొద్ది రోజుల క్రితం నిజాంపేట్ మున్సిపల్ అధికారులు ప్రహరీ నిర్మాణం కోసం బెస్మెంట్ తీశారు.

కానీ స్థానిక కార్పొరేటర్ షాడో మేయర్ తో లాబీయింగ్ చేసి మున్సిపల్ ప్రహరీ హద్దులు మార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ పత్రాలు చూపుతూ ఈ స్థలం ప్రభుత్వానికి కాదు వదిలేయండి అంటూ షాడో మేయర్ మున్సిపల్ అధికారులకు హుకుం జారీ చేసినట్లు వినికిడి. బహిరంగ మార్కెట్ ప్రకారం ఈ స్థలం విలువ కోట్లలో ఉన్నప్పటికీ అధికారులలో ఏమాత్రం చలనం లేకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేస్తుంది. నిజాంపేట్ షాడో మేయర్ ఒత్తిడితోనే రెవిన్యూ, మున్సిపల్ అధికారులు ప్రభుత్వ ఆస్తులను ప్రజా ప్రతినిధులకు అనధికారికంగా రాసి ఇస్తున్నారని పౌరులు వాపోతున్నారు.

తహసీల్దార్ మౌనం ఎందుకు సంకేతం..?

బాచుపల్లి మండలంలో వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు కనుమరుగవుతున్నా బాచుపల్లి తహసీల్దార్ మౌనం వహిస్తున్నారు. ప్రతీ రోజు పత్రిక కథనాలు వెలువడినా, కబ్జాలపై, అక్రమ 59 జీవో దరఖాస్తులపై ఫిర్యాదులు వచ్చినా బాచుపల్లి రెవిన్యూ యంత్రాంగంలో ఉలుకుపలుకు లేకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతల పైరవీ, ఒత్తిడుల తోనే ప్రభుత్వ భూముల కబ్జాలపై బాచుపల్లి తహసీల్ వ్యవస్థ కాలు కదపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. షాడో టీమ్ కబ్జాల వెనుక రెవిన్యూ యంత్రాంగం కూడా భాగస్వాములేనా అనే సందేహాలను ప్రజలు వ్యక్త పరుస్తున్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ లో ఒక్కొకటిగా వెలుగు చూస్తున్న కబ్జాల చిట్టాను' దిశ ' వరుస కథనాలు అందించనుంది.

Advertisement

Next Story