- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేతల చెరలో చెరువులు
దిశ, మేడ్చల్ బ్యూరో : చెరువులను నేతలు చెరబట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు, ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో మరికొందరు చెరువులను ఖతం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లని కూడా లెక్క చేయకుండా పెద్ద పెద్ద గోదాములు, ఫంక్షన్ హాల్స్ నిర్మించడంతో మేడ్చల్ జిల్లా, తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయంజాల్ లోని చెరువులు కుచించుకుపోయాయి. మరికొన్నయితే పూర్తిగా కనుమరుగయ్యాయి. గత సర్కారు హయాంలో సాక్ష్యాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి బంధువులు, అనుచరులు బాజాప్తాగా చెరువులను మింగి లగ్జరీ విల్లాలు, ఫాంహౌస్ లు, గోదాములు, అతిథి గృహాలను నిర్మించుకున్నారు.
రూ. కోట్ల విలువైన శిఖం కబ్జా
శామీర్ పేట మండలంలోని దేవరయంజాల్ లో చెరువుల కబ్జా యథేచ్ఛగా కొనసాగుతోంది. కుంటోళ్ల బాయి కుంట (లేక్ నెంబర్ 399) 2013 సంవత్సరానికి ముందు 22.24 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, 2023 నాటికి ఈ చెరువులో 9 ఎకరాల 19 గుంటల శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. చెరువు శిఖం భూములను కబ్జా చేసి కబ్జాదారులు అక్రమంగా పెద్ద పెద్ద గోదాములను నిర్మించుకున్నారు. పేరొందిన ఉత్పత్తుల తయారీ సంస్థలు, కంపెనీలకు అద్దెకు ఇచ్చి నెల నెలా రూ. లక్షల్లో అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు.
అదే విధంగా దేవరయంజాల్ చెరువు( లేక్ నెంబర్ 398) 2013 కు ముందు 6 ఎకరాలు 8 గుంటల విస్తీర్ణంలో ఉంది. 2023 నాటికి ఈ చెరువులో 2 ఎకరాల 7 గుంటలను కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా గోదాములను కొందరు పొలిటికల్ లీడర్లు నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు చెరువుల చుట్టూ ఉన్న నీటి ప్రవాహ కాల్వలను సైతం కబ్జాదారులు మూసివేసి గోదాములను నిర్మించడంతో చెరువులోకి వర్షం నీరు రాకుండా అడ్డు కట్ట వేశారు. మెల్లమెల్లగా మట్టితో చెరువులను పూడ్చుతూ కబ్జా చేస్తున్నారు.
భూముల విలువ రూ.200 కోట్ల పై మాటే..
ఈ రెండు చెరువులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి సమీపంలో ఉండడంతో ఒక్కో ఎకరం ధర రూ.20 కోట్ల వరకు పలుకుతుంది. ఈ లెక్కన కబ్జాదారులు కబ్జా చేసిన శిఖం భూముల విలువ దాదాపు రూ.200 కోట్లకు పై మాటే. అదే విధంగా 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోమటి కుంట చెరువు(లేక్ నెంబర్ 391) లో ఓ బడా లీడర్ దాదాపు రెండు ఎకరాలు కబ్జా చేసి రిసార్ట్, ఫంక్షన్ హాల్ నిర్మించాడు.
ఈ శిఖం విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో కోమటికుంట చెరువు కబ్జాపై సాక్షత్తు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తావించారు. హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సైతం ఇటీవల కోమటికుంట చెరువు కబ్జాలను పరిశీలించింది.
నోటీసులు, కేసులతోనే సరి..
చెరువు శిఖం, ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నట్లు ఫిర్యాదులు, పత్రికలలో కథనాలు వచ్చినప్పుడు హడావిడి చేసి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు అక్రమణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారని విమర్శలు ఉన్నాయి. గతంలో చెరువులను కబ్జా చేస్తున్న వారిపై పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ లో ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయగా వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే కేసుల దర్యాప్తు మాత్రం ముందుకు సాగడంలేదు.
అక్రమణదారులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరిపోయి తాము అధికార పార్టీ నేతలమని, తమ జోలికి వస్తే ఇబ్బందులు తప్పవని అధికారులపై ఒత్తిడి తేస్తున్నట్లు సమాచారం. కొందరు పోలీస్ అధికారులను ప్రలోభ పెట్టి కబ్జారాయుళ్లు ఇప్పటికీ చెరువు లను కబ్జా చేస్తూనే ఉన్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు సైతం నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు కబ్జారాయుళ్లకు పరోక్షంగా సహకరిస్తూ నెలవారి ముడుపులు తీసుకుంటున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా హైడ్రా కబ్జాకు గురైన దేవరయంజాల్ చెరువులపై ప్రత్యేక దృష్టి సారించి, కబ్జారాయుళ్ల అట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు.