ప్రైవేటు భూమిలో అనుమతులు... ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు..!

by Kavitha |
ప్రైవేటు భూమిలో అనుమతులు... ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు..!
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రైవేట్ భూమిలో నిర్మాణం కోసం అనుమతులు తీసుకొని దాని పక్కనే ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్లలో కొంత భూమిని కలుపుకొని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బడా బడా సంస్థలు ఈ తరహా భూకబ్జాలకు పాల్పడుతున్న విషయం ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో నిజాంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మితమవుతున్న "పావని ఫెలిసిటీ " సెంటర్ భవన నిర్మాణం సైతం జరుగుతుందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూమిలో..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 334 లో 34 ఎకరాల ఐదు గుంటల భూమి రికార్డులు ప్రకారం ప్రభుత్వ భూమిగా ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 332 లో 71 ఎకరాల 12 గుంటల భూమి ఉండగా, సబ్ డివిజన్ 332/1 లో 70 ఎకరాల 12 గుంటలు భూమి ప్రభుత్వ భూమిగా గుర్తింపబడింది. అంతేకాకుండా సర్వేనెంబర్ 330 లో ఉన్న ఒక ఎకరం 21 ప్రభుత్వ భూమి ఉండగా, సర్వేనెంబర్ 329 లో 31 గుంట ప్రభుత్వం మీద ఉన్నట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. కాగా పావని ఫెలిసిటీ సెంటర్ భవన నిర్మాణం సర్వేనెంబర్ 331లో జరుగుతున్నాయి. ఈ సర్వే నెంబర్ అయినా 331 కు ఆనుకునే ప్రభుత్వ భూములు కలిసి ఉన్నాయి. 331/అ లో పావని ఫెలిసిటీ భవన నిర్మాణం జరుగుతుండగా దీనికి సర్వేనెంబర్ 334, 332/1 ప్రభుత్వ భూములు సర్వేనెంబర్ 331 కు ఆనుకొని ఉన్నాయి. అయితే సదర నిర్మాణ సంస్థ ప్రభుత్వ భూమిగా చెప్పబడుతున్న సర్వే నెంబర్ 334 తో పాటుగా సర్వేనెంబర్ 332 లో సైతం జరిగి నిర్మాణం చేపడుతుందని ఆరోపణలు ఉన్నాయి .

విలేజ్ మ్యాప్ లో స్పష్టంగా..

ప్రభుత్వ భూమిని ఆక్రమించి పావని ఫెలిసిటీ సెంటర్ భవన నిర్మాణం జరుగుతుంది అనే ఆరోపణలకు విలేజ్ మ్యాప్ ను పరిశీలిస్తే స్పష్టమవుతుందని తెలుస్తుంది. నిర్మాణ సంస్థ పేర్కొంటున్న భూమిని విలేజ్ మ్యాప్ తో పోల్చుకుంటే వ్యత్యాసం క్లియర్ గా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని గూగుల్ మ్యాప్ తో పరిశీలిస్తే సర్వే నెంబర్ 331 తో పాటుగా ప్రభుత్వ భూమిలో కూడా నిర్మాణం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.

గుడ్డిగా అనుమతులు ఇచ్చేసారా..?

23 అంతస్తుల భవనం తో పాటుగా 2 సెల్లార్లు, ఒక స్టీల్ట్ నిర్మాణం కోసం పావని ఫెలిసిటీ సెంటర్ నిర్మాణానికి హెచ్ఎండిఏ అనుమతులు జారీ చేసింది. అయితే నిర్మాణ అనుమతులు జారీ చేసే ముందు సరిగ్గా లొకేషన్ ను గుర్తించకపోవడంతో పాటుగా, విలేజ్ మ్యాప్ లో సర్వేనెంబర్ 331 ఏ విధంగా కనిపిస్తోంది..? క్షేత్రస్థాయిలో పావని ఫెలిసిటీ సెంటర్ వారు ఏ భూమిని తమదిగా చూపిస్తున్నారు..? అనే విషయాలను పూర్తిగా పరిశీలించకుండానే అనుమతులు జారీ చేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed