విలీన గ్రామాలకు లైన్ క్లియర్..

by Sumithra |
విలీన గ్రామాలకు లైన్ క్లియర్..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ఔటర్ రింగ్ రోడ్డు లోపల, అవతల గ్రామాల విలీనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో కలిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ నెల 2న పురపాలక చట్ట సవరణ ఆర్డినెన్స్ 2024 ను జారీ చేసింది. దీంతో ఇంతకాలం శివారు గ్రామాలు సమీప పురపాలికల్లో విలీనం చేస్తారా..? అనే ఎన్నికలు నిర్వహిస్తారా..? అనే ఉత్కంఠకు తెరపడింది. ఇక మీదట 51 విలీన గ్రామాలను మున్సిపాలిటీలుగానే పరిగణించనుండడంతో... రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను ఆయా గ్రామాల్లో నిర్వహించారు.

మేడ్చల్ జిల్లాలోనే అధికం..

విలీన గ్రామాల్లో మేడ్చల్ జిల్లాలోనే అత్యధిక గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మొత్తం 51 విలీన గ్రామాల్లో మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఔటర్ లోపల 10 గ్రామాలు, బయట 18 గ్రామాలు మొత్తం 28 గ్రామ పంచాయితీలు విలీనం అవుతున్నాయి. మిగితా 34 గ్రామాలు మాత్రమే గ్రామ పంచాయితీలుగా మేడ్చల్ జిల్లాలో కొనసాగనున్నాయి. ఇక్కడ 28 గ్రామాలను 7 మున్సిపాలిటీలలో విలీనం చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 12 గ్రామాలు విలీనం అవుతుండగా, 4 మున్సిపాలిటీలలో కలువనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 11 గ్రామాలను 2 మున్సిపాలిటీలలో విలీనం చేయనున్నారు. ఓఆర్ఆర్ వరకు రెవెన్యూ పరిధి విస్తరించి ఉన్న గ్రామాల ప్రతిపాదికన మాత్రమే విలీనం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పాలన సౌలభ్యం కోసమే..

ఔటర్ రింగు రోడ్డు పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు ఉండడం వల్ల పాలక వర్గాలు, అధికారుల మధ్యన సమన్వయం కొరవడుతోంది. పక్క పక్కనే గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ ఉన్నందున పరిపాలన అంతటా సజావుగా సాగడం లేదని ప్రభుత్వం గ్రహించింది. దీంతో అభివృద్ది విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ నగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిని విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేసి, అర్బన్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్ సీఐ)హైదరాబాద్ ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగం అభిప్రాయాలను తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు రెవెన్యూ పరంగా విస్తరించి ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 51 గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ ను జారీ చేసింది.

మేడ్చల్ జిల్లా పరిధిలో..

మున్సిపాలిటీలు విలీన గ్రామపంచాయితీలు

ఘట్ కేసర్ అంకుషాపూర్, అవుషాపూర్, మాదారం, మర్రిపల్లి గూడ, ఏదులాబాద్, ఘనాపూర్

నాగారం భోగారం, గోధుమ కుంట, కరీంగూడ, రాంపల్లిదాయర

తూంకుంట బాబా గూడ, బొమ్మరాసిపేట, శామీర్ పేట

మేడ్చల్ రాయిలాపూర్, పూడురు

గుండ్ల పోచంపల్లి గౌడవెల్లి, మునీరాబాద్

దమ్మాయిగూడ యాద్గార్ పల్లి, అంకిరెడ్డి పల్లి, చీర్యాల, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి,

పోచారం చౌదరిగూడ, వెంకటాపూర్, కాచవాని సింగారం,కొర్రెముల, ప్రతాప్ సింగారం

రంగారెడ్డి జిల్లాలో..

పెద్ద అంబర్ పేట కుత్బుల్లాపూర్, తారామతిపేట, గౌరెల్లి, బాచారం

శాంషాబాద్ రషీద్ గూడ, బహుదూర్ గూడ, హమీదుల్లా నగర్, చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, ఘన్సీమియాగూడ

నార్సింగ్ మీర్జాగూడ

తుక్కుగూడ హర్షగూడ

సంగారెడ్డి జిల్లాలో..

అమీన్ పూర్ ఐలాపూర్, ఐలాపూర్ తండా, కిష్టారెడ్డి పేట, పటేల్ గూడ, దాయర, సుల్తాన్ పూర్

తెల్లాపూర్ పోచారం, ముత్తంగి, కర్దనూర్, పాటి, ఘనాపూర్

ఆ తర్వాత జీహెచ్ఎంసీలోకి.. !

ఈ క్రమంలోనే పదవీ కాలం పూర్తయిన పంచాయితీలను డీ నోటీ ఫై చేసి,.. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా గ్రామ పంచాయితీల జాబితాను పంపాలని మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించగా, ఆ మూడు జిల్లా కలెక్టర్లు నివేదిక అందజేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పాలక వర్గాల పదవీ కాలం పూర్తయిన పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్ ను జారీ చేసింది. ఆ తర్వాత పురపాలక, నగర పాలిక సంఘాల పదవీకాలం పూర్తయ్యాక వాటిని సైతం జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నారని పంచాయతీ రాజ్ శాఖ కు చెందిన ఓ కీలక అధికారి ‘దిశ’ తో వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు అవతలి వరకు విస్తరించవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed