ప్రైవేట్ వైద్యం.. ప్రాణాలతో చెలగాటం..!

by Sumithra |
ప్రైవేట్ వైద్యం.. ప్రాణాలతో చెలగాటం..!
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రైవేటు వైద్య వ్యాపారంలో ఎన్నో లొసుగులు.. మరెన్నో అక్రమాలు బహిర్గతమవుతున్నా.. వైద్యారోగ్యశాఖ ఉదాసీనంగా వ్యవహారిస్తోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఫిర్యాదులు అందినా ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టకుండానే మమ అనిపించడం.. మామూళ్ల మత్తులో మునిగి తేలడం రివాజుగా మారింది. దీంతో మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లాలో అక్రమార్కుల ప్రైవేటు ఆసుపత్రుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. వైద్యారోగ్య శాఖలో ఇంటి దొంగల తీరుతో ఆ శాఖ వ్యవహారం మాయని మచ్చగా మిగులుతోంది. రోజుకో రూపంలో ఆ శాఖకు చెందిన అవకతవకలు గుట్టురట్టు అవుతుండడంతో.. పరువు పోగొట్టుకుంటుంది.

బోగస్ దవాఖానాలు.. నకిలీ వైద్యులు...

సేవల రంగంగా పేరొందిన వైద్యం కొందరి వల్ల ఫక్తు వాణిజ్య రంగంగా మారుతోంది. డబ్బులుంటే చాలు లాభసాటి వ్యాపారంగా ఓ దవాఖానను ఏర్పాటు చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. వైద్యారోగ్య శాఖలోని ఓ ఉద్యోగి ఆశీస్సులతో ఎడాపెడా బోగస్ దవాఖానాలు వెలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైద్యం పై ఎలాంటి అవగాహన లేకపోయినా కొందరు నకిలీ డాక్టర్లు మల్టీ స్పెషాలిటీ దవాఖానలకు యజమానులుగా మారిపోతున్నారు. వీటిపై ఫిర్యాదులు అందినా వాటి జోలికి మాత్రం సదరు ఉద్యోగి పోనివ్వరు. వైద్యో నారాయణ హరి అన్న నానుడిని సదరు ఉద్యోగి తిరగేసి.. కమీషన్ల వ్యవస్థను ప్రవేశ పెట్టి రోగులను ఆదాయ వనరుగా మారుస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

నిబంధనలు బేఖాతరు..

జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్ లు, డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వాటికి సరైన అనుమతులు ఉన్నాయా ? లేవా ? డాక్టర్లకు అర్హత ఉందా ? లేదా ? అనే విషయాల పై ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదు. ప్రజలను ఆకర్షించడానికి పెద్ద పెద్ద లైటింగ్ బోర్డ్స్ పెట్టి మెరుగైన వైద్యం పేరుతో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. వైద్య ముసుగులో నడిచే మెడికల్ దందాకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ 2020 చట్టం’ ప్రకారం ప్రతి ఆసుపత్రి, ప్రతి క్లినిక్‌లో ఆసుపత్రికి సంబందించిన రిజిస్ట్రేషన్, అందులో పనిచేస్తున్న డాక్టర్ల అర్హత, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించాలని సూచించింది. అయితే చాలా వరకు ఆసుపత్రులు, వైద్యులు ఈ నిబంధనలు పాటించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో నకిలీ ఆసుపత్రులు, వైద్యులు రోగులకు చికిత్స అందించడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఉప్పల్ లో ల్యాబ్ టెక్నీషియన్ బిక్షపతి నకిలీ డాక్టర్ అవతారం ఎత్తి ఏళ్ల తరబడి వైద్యం అందించడం జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇటు సీజింగ్.. అటు ఓపెన్..

జిల్లాలో స్టేట్ మెడికల్ కౌన్సిల్ (ఎస్ఎంసీ) బృందం ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బోగస్ ఆసుపత్రులు, నకిలీ డాక్టర్ల విషయం బయటపడింది. దీంతో ఆయా ఆసుపత్రులను తనిఖీలు చేసి, సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి పదుల సంఖ్యలో ఆసుపత్రులను సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన వారం, పది రోజుల్లోనే ఆయా ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లు, డయాగ్నస్టిక్ సెంటర్లను తెరుచుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్ఎంసీ ఆదేశాల ప్రకారం ఉప్పల్ లోని శ్రీ మణికంఠ పాలీ క్లినిక్ ను ఏప్రీల్ నెలలో సీజ్ చేశారు.

సీజ్ చేసిన నెల వ్యవధిలోనే తిరిగి ఓపెన్ అయ్యింది. అంతేకాకుండా ఆ ఆసుపత్రికి వైద్యారోగ్య శాఖ అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఒక్క ఆసుపత్రి సీజింగ్.. తిరిగి ఓపెన్ చేసేందుకు రూ. లక్షల్లో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదే మణికంఠ ఆసుపత్రిని ఈ నెల 9న ఎస్ఓటీ పోలీసులు ఆసుపత్రిని సీజ్ చేసిన విషయం విధితమే. ఇదే తరహారలో ఇటీవల ఉప్పల్ లో సీజ్ చేసిన వాసవి డయాగ్నస్టిక్ సెంటర్, శోభ సాయి డయాగ్నస్టిక్, ధన్వంతరి డయోగ్నస్టిక్ సెంటర్లు తిరిగి ఓపేన్ కావడం విమర్శలకు తావిస్తోంది. వీటితో పాటు జిల్లాలో ఇటీవల సీజ్ చేసిన 80 శాతం ఆసుపత్రులు తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లాలో సాగుతున్న ప్రైవేట్ వైద్య దందా పై సమగ్ర విచారణ జరిపించి, దోషుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed