అష్ఠదిగ్భందంలో కాముని చెరువు...

by Sumithra |
అష్ఠదిగ్భందంలో కాముని చెరువు...
X

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి నియోజకవర్గంలోని కాముని చెరువు అష్ఠదిగ్భంధనంలో చిక్కుకుని తన ఉనికిని కోల్పోతుంది. ముచ్చటగా రెండు డివిజన్​ల మధ్య చిక్కుకున్న చెరువును ఎనిమిది దిక్కుల నుంచి మట్టితో నింపి చదును చేస్తు కబ్జాకు పాల్పడుతున్నారు. అన్ని తెలిసిన రెవెన్యు, ఇరిగేషన్​ అధికారులు క్రిమినల్​ కేసులు పెట్టాం అంటు చేతులు దులుపుకుంటున్నారు. కబ్జా చేసిన వారు చిన్న చిన్న కేసులే కావడంతో స్టేషన్​ బేయిల్​ తీసుకుని యధేచ్ఛగా బయట తిరుగుతున్నారు.

కూకట్​పల్లి మండల పరిధిలోని కూకట్​పల్లి, మూసాపేట్​ రెండు గ్రామల మధ్య కాముని చెరువు ఉంది. ఇందులో ఎఫ్టీఎల్​ పరిధి కూకట్​పల్లి గ్రామ సర్వే నంబర్​లు 989, 990, 993, 933/పి, 934, 994, 992/పి, మూసాపేట్​ గ్రామ సర్వేనంబర్లు 80, 49, 78. బఫర్​ జోన్​ పరిధి కూకట్​పల్లి గ్రామ సర్వేనంబర్​లు 989, 992/పీ, 934, 988, 991, 987, 992, 931, 933, 935, మూసాపేట్​ గ్రామ సర్వే నంబర్​లు 48, 50, 78, 49, 79, 81లలో ఉంది. ఇదిలా ఉండగా ఇందులో 934, 935, 990, 993 సర్వే నంబర్​లు హౌసింగ్​ బోర్డు విభాగానికి సంబంధించినవి కాగా సర్వే నంబర్​ 933 డెక్కన్​ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్​ సంస్థకు సంబంధించినవి.

మొత్తం కాముని చెరువు ఎఫ్​టీఎల్​ ఏరియా 101.28 ఎకరాలు కాగా అందులో ఇప్పటికే రాఘవేంద్ర సొసైటి పేరుతో సుమారు పది ఎకరాల వరకు కబ్జాకు గురైనట్టు రెవెన్యు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా అల్లాపూలర్​ యూసుప్​ నగర్​ సమీపంలోని ఎస్​టిపి, స్మశాన వాటిక, రోడ్డు పేరుతో కొన్ని ఎకరాల స్థలం కెటాయించారు. మిగిలిన స్థలంలో రాఘవేంద్ర సొసైటి వైపు నుంచి కొంత మంది, అల్లాపూర్​ సఫ్దర్​నగర్​ వైపు నుంచి చెరువు కట్ట పొడవున, చెరువు మరో వైపు ప్రైవేటు సర్వే నంబర్​ పేరుతో కొంత మంది చెరువును మట్టితో నింపుతున్నారు. 101 ఎకరాల అతి పెద్ద చెరువు కాస్తా 40 ఎకరాల వరకు చేరుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2022, నవంబర్​లో కేసులు నమోదు..

2022 నవంబర్​ నెలలో కొంత మంది చెరువు ఎఫ్​టిఎల్​ ఫెన్సింగ్​ను తొలగించి రాఘవేంద్ర సొసైటి వైపు చెరువును మట్టితో నింపి సుమారు రెండు ఎకరాల స్థలాన్ని చదును చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యు, ఇరిగేషన్​ అధికారులు చెరువును పరిశీలించి కబ్జాకు పాల్పడిన కొంత మందిపై కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో నవంబర్​ 12, 2022న క్రైం నంబర్​ 854/2022లో ఐపిసి 427, సెక్షన్​ 3 ఆఫ్​ పిడిపిపిఏ, 35 ఆఫ్​ టిఎస్​వాల్టా యాక్ట్​ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

తూతూ మంత్రంగా చర్యలు..

కాముని చెరువులో కబ్జాల పర్వం కొనసాగుతున్న రెవెన్యు, ఇరిగేషన్​ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటుండటంతో కబ్జాకు పాల్పడుతున్న వారు యధేచ్చగా కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. 2022, నవంబర్​లో జరిగిన కాముని చెరువులో మట్టి పోసీ కబ్జా చేసిన విషయం పెద్ద దుమారాన్ని లేపింది. అఖిల పక్ష పార్టీల నాయకులు అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే కబ్జా భాగోతం జరుగుతుందని ఆరోపించారు. దీనికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కాముని చెరువును రెవెన్యు, ఇరిగేషన్​, పోలీస్​, జీహెచ్​ఎంసీ అధికారులతో సందర్శించి కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు నమోదు చేసిన స్టేషన్​ బేయిల్​పై బయటికి వచ్చారన్న విషయంపై, సహజ సిద్దమైన చెరువును కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఏందంటు ఎమ్మెల్యే అధికారులను ఆగ్రహించారు.

వాచ్​ టవర్​ సాక్షిగా మట్టిని నింపుతున్నారు..

అల్లాపూర్​ సఫ్దర్​నగర్​ కాలనీ వైపు కాముని చెరువు కబ్జాకు గురి కాకుండా నిరంతరం నిఘా ఉంచేందుకు ఏర్పాటు చేసిన వాచ్​ టవర్​ సమీపంలోనే చెరువు కట్టపై నిర్మాణ వ్యర్థాలను పోసి చెరువును మట్టితో పూడ్చే తతంగం కొనసాగుతున్నా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసేందుకు సిద్ధంగా లేరు.

చెరువు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం..

కాముని చెరువును మట్టితో నింపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసి కబ్జాకు పాల్పడుతున్న వారిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటాం. చెరువును స్వయంగా సందర్శించి వివరాలు సేకరిస్తా.

రియల్​ ఎస్టేట్​ దంధా కోసం చెరువు సుందరీకరణకు ముందుకు వచ్చిన బడా రియల్​ సంస్థ..

కాముని చెరువు సమీపంలో తమ వ్యాపారం కొనసాగిస్తున్న బహుళ అంతస్థుల నిర్మాణ సంస్థ అయిన సైబర్​ సిటి డెవలపర్స్​ కాముని చెరువును సీఎస్​ఆర్​ కింద సుందరీకరణ చేసేందుకు ముందుకు వచ్చింది. కబ్జాకు గురి అయిన తరువాత మిగిలిన చెరువును బడా సంస్థ సుందరీకరిస్తానని చెప్పగానే ప్రభుత్వంలోని పెద్దలు సైతం గ్రీన్​ సిగ్నల్​ చూపించారు. సుందరీకరణ వెనుక మతలబు ఉంది అనే ప్రశ్నలు ఉత్పన్నవతున్నాయి. తమ నిర్మాణ సంస్థ నిర్మించిన, నిర్మిస్తున్న కొత్త వెంచర్లకు సంబంధించిన బ్రౌచర్లలో లేక్​ వీవ్​ అనే పదాన్ని జోడించి అందులో మనుషులతో పాటు పెంపుడు జంతువులకు సైతం ప్రత్యేక పార్కులను ఏర్పాటు చేసినట్టు చూపించుకుని కొత్త వెంచర్​లో ఫ్లాట్​లను కోట్లాది రూపాయలకు విక్రించుకుంటు సిఎస్​ఆర్​ పేరుతో చెరువును సుందరీకరించి నాలుగు రాళ్లు ఎక్కువనే వెనకేసుకునేందుకు బడా సంస్థలు ముందుకు వచ్చినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed