- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెరువులకు ‘ఉరి’.. అడుగంటుతున్న భూగర్భ జలాలు
దిశ, మేడ్చల్ బ్యూరో : చెరువులను కాపాడుతాం, పరిసరాలను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అర్బన్ మిషన్ కాకతీయ జలాశయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సుందరీకరణ పేరిట చెరువులకు ‘ఉరి’ వేశారు. చుట్టూ బండ్, వాకింగ్ ట్రాక్‌లు, ల్యాండ్ స్కేపింగ్ పై చూపిన శ్రద్ధ చెరువులను సజీవంగా ఉంచడం పై చూపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అవి ఎండిపోవడమే కాదు దీర్ఘకాలంలో భూగర్భ జలాలపైనా ప్రభావం చూపుతుందని పర్యావేణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లోకి వచ్చిన వర్షపు నీరు బయటకు వెళ్లకుండా కనీస చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వరద రాకుండా ఇన్‌లెట్‌లు..
అర్బన్ మిషన్ కాకతీయలో భాగంగా గ్రేటర్‌లోని 19 చెరువుల సుందరీకరణ పనులకు జీహెచ్‌ఎంసీ 2018, ఏప్రీల్ లో శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం రూ.280 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. చుట్టూ బండ్, వాకింగ్ ట్రాక్, ల్యాండ్ స్కేపింగ్, కుర్చీలు, ఆహ్లాదాన్ని పంచే మరిన్ని ఏర్పాట్లు చేయడం ఈ ప్రాజెక్టు ప్రధానోద్ధేశం. అయితే అప్పటికే 19 చెరువులు అక్రమణకు గురయ్యాయి. వీటి ఆక్రమణల జోలికి వెళ్లకుండా, ప్రస్తుతం చెరువు ఉన్న మేర మాత్రమే బండ్ నిర్మించారు. చెరువులోకి వచ్చే మురుగు నీటిని దిగువకు మళ్లించారు. ఇదే చెరువులకు ఉరిగా మారింది. మురుగు నీరే కాదు, వర్షపు నీరు కూడా చెరువులోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మురుగు నీరు చెరువులోకి రాకుండా, వర్షాలు కురిసినప్పుడు నిర్ణీత స్థాయి దాటిన వరదనే చెరువులోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే చెరువులకు చేటు తెచ్చింది.
వర్షాలు కురిసినా..
ఈ వానకాలం సీజన్ లో కురిసిన వర్షాలతో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వారం, పది రోజులపాటు ఇళ్లు, రోడ్లు అన్న తేడా లేకుండా నగరంలోని పలుకాలనీలు, బస్తీలు నీట మునిగాయి. ఎగువ, పల్లం అన్నది లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వరద ఉధృతి కనిపించింది. కానీ అక్కడక్కడా మిగిలిన కొన్ని చెరువులు ప్రస్తుతం పగుళ్లు బారాయి. చుక్క నీరు లేక ఎండి పోతున్నాయి. వర్షాలు కురిసినప్పుడు పొంగి పొర్లిన చెరువులు ఇప్పుడెందుకు నెర్రెలు బారాయి..? ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టాలని పౌరులకు చెప్పే ప్రభుత్వ విభాగాలు ఏం చేస్తున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తగ్గుతున్న భూగర్భ జలాలు..
చెరువులు ఎండిపోవడంతో పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలపైనా ప్రభావం పడుతోంది. ఇటీవలి కాలంలో వర్షాలతో పెరిగిన భూగర్భ జల మట్టాల్లో తాజాగా తగ్గుదల కనిపిస్తోందని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. వర్షపు/మురుగు నీరుతో చెరువులో ఉండే భూగర్భ జలాలు మెరుగ్గా ఉండేవని హస్మత్ పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోని ప్రజలు చెబుతున్నారు. గుర్రపు డెక్క పెరిగి దోమల బెడద తీవ్రమవుతోందని, అందుకే మురుగు నీటిని పూర్తిగా మళ్లించామని అధికారులు చెబుతున్నారు. అయితే, వర్షపు నీరైనా చెరువులోకి వచ్చేలా చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సుందరీకరణ పనులు కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో నిలిచిపోయాయి. హస్మత్‌పేటలోని బోయిన్ చెరువు, గంగారం, పటేల్ చెరువు, నెక్నాంపూర్ లేక్‌ల వద్ద సుందరీకరణ పనులు అర్దంతరంగా ముగిసిపోయాయని స్థానికులు చెబుతున్నారు.
సుందరీకరణకు రూ.282.63 కోట్లు..
గ్రేటర్ పరిధిలో ఉన్న 19 చెరువుల అభివృద్దికి ప్రభుత్వం రూ.282.63 కోట్లను మంజూరు చేసింది. జీఓ నెం.560 ప్రకారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 19 చెరువులను పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ది చేయాలని పరిపాలన అనుమతులు జారీ చేశారు.
అభివృద్ది కోసం నిధులు కేటాయించిన చెరువుల వివరాలు, నిధులు..
చెరువు, గ్రామం, నిధులు(రూ.కోట్లలో)
పటేల్ చెరువు, మదీన గూడ, 12.30
అంబర్ చెరువు, ప్రగతి నగర్, 25.34
బోయిన్ చెరువు, హస్మత్ పేట, 14.45
మల్క చెరువు, ఉప్పర్ పల్లి, 4.70
పెద్ద చెరువు, నెక్నాంపూర్, 21.62
మల్కా చెరువు, రాయదుర్గం, 7.89
పెద్ద చెరువు, గంగారం, 19.05
చర్లపల్లి ట్యాంక్, చర్లపల్లి, 12.28
ముక్కిడి చెరువు, ఆర్.కె.పురం, 11.82
నల్లగండ్ల చెరువు, నల్లగండ్ల, 16.04
ఊర చెరువు, కాప్రా, 9.41
అంతగాని కుంట, షేక్ పేట, 6.22
సుర్రం చెరువు, బండ్ల గూడ, 8.55
పెద్ద చెరువు, మున్సూరాబాద్, 7.39
మద్దెల కుంట, బైరామల్ గూడ, 4.07
మోహిని కుంట, అంబర్ పేట, 10.07
దుర్గం చెరువు, రాయదుర్గం, 4.46
నల్ల చెరువు, ఉప్పల్, 7.85
ఫాక్స్ సాగర్, జీడిమెట్ల, 42.22
......................
మొత్తం, 282.63