సీజ్​ చేస్తున్న మారడం లేదు.. యధేచ్చగా అక్రమ నిర్మాణాలు..

by Sumithra |
సీజ్​ చేస్తున్న మారడం లేదు.. యధేచ్చగా అక్రమ నిర్మాణాలు..
X

దిశ, కూకట్​పల్లి : అక్రమ నిర్మాణాల పై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారా.. నిర్మాణ దారులకు భయం లేకుండా పోయిందా.. మూసాపేట్​ సర్కిల్​ పరిధిలో ఇష్టారాజ్యంగా పుట్టుకు వస్తున్న అక్రమ నిర్మాణాలను చూస్తున్న ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న ఇది. వంద గజాలలోపు స్థలాల నుంచి మూడు వందల గజాల స్థలాలైన ఎటువంటి అనుమతులు లేకుండా, తీసుకున్న అనుమతులకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు నిర్మాణదారులు. ఇంత జరుగుతున్న అధికారులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడంతో నిబంధనలను బేఖాతరు చేస్తున్న నిర్మాణాల సంఖ్యలో వందలలో ఉంటుంది. మూసాపేట్​ సర్కిల్​ పరిధిలోని కేపీహెచ్​బీ కాలనీ, సర్దార్​పటేల్​ నగర్​, వసంత్​నగర్​, భగత్​సింగ్​నగర్​, ఆంజనేయ నగర్​, ప్రగతి నగర్​, మూసాపేట్​, 15 ఫేజ్​, కైతలాపూర్​ పరిధిలో అక్రమ నిర్మాణాలు కొన్ని వందల సంఖ్యలో కొనసాగుతున్నాయి.

ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన, వరుసగా ఫిర్యాదులు అందిన తర్వాత కొన్ని నిర్మాణాలను టౌన్​ప్లానింగ్​ అధికారులు ఈ మధ్య కాలంలో సీజ్​ చేశారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ అధికారులు సీజ్​ చేసిన భవనాల పక్కనే మరిన్ని అక్రమ నిర్మాణాలు చేపడుతుండటం గమనార్హం. మూసాపేట్​ సర్కిల్​ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రగతి నగర్​ కాలనీలో ఓ వ్యక్తి ఏకంగా వంద గజాల లోపు స్థలంలో 6 అంతస్థులు నిర్మించాడు. సర్కిల్​లో ఎక్కడ అక్రమ నిర్మాణం చేపడుతున్న ఆ నిర్మాణం వెనుక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉంటుందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అంతే కాకుండా సర్కిల్​లో ఎన్నో ఏండ్లుగా పాతుకు పోయి ఉన్న టౌన్​ప్లానింగ్​ విభాగం పర్మినెంట్​ ఉద్యోగి ఒకరు ఉన్నత అధికారుల కండ్లు కప్పి అక్రమ నిర్మాణాల వెనుక ఉంటూ నిర్మాణాలు చేపడుతున్న వారికి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికైనా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed