మీర్కాన్ కుంట ఆక్రమణపై హైడ్రా అధికారులు దృష్టి

by Sridhar Babu |
మీర్కాన్ కుంట ఆక్రమణపై హైడ్రా అధికారులు దృష్టి
X

దిశ, ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని మీర్కాన్ కుంటను హైడ్రా అధికారులు సందర్శించారు. 4.12 ఎకరాల మీర్కాన్ కుంటలో చల్లపల్లి బతుకమ్మ ఘాట్ నిర్మాణం పేరుతో దాదాపు 2 వేల గజాల స్థలం పూడ్చి వేశారని, ఎఫ్టీఎల్ కబ్జాకు గురైందని ఈ సంవత్సరం ఆగస్టు నెలలో పదో వార్డ్ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం హైడ్రా అధికారులు మీర్కాన్ కుంటను సందర్శించి వెంకటేష్ గౌడ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

మీర్కాన్ కుంట కబ్జా విషయంలో స్థానిక ప్రజాప్రతినిధి (చైర్మన్) మరో వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని వెంకటేష్ గౌడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మీర్కాన్ కుంట భౌతిక స్థితిగతులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పోచారం మున్సిపాలిటీకి హైడ్రా అధికారులు వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల్లో ఎఫ్టీఎల్ కబ్జా, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story