ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ.. లేని రోగాన్ని అంటగట్గి లక్షల్లో బిల్లులు..

by Sumithra |
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ.. లేని రోగాన్ని అంటగట్గి లక్షల్లో బిల్లులు..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ పట్టణానికి చెందిన వెంకటేష్ భార్య స్వాతి అనారోగ్యానికి గురయ్యారు. స్థానికంగా ఉన్న లీలా ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకువెళ్లారు. పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని ఐసీయూలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం స్వాతికి ముందుగా క్యాన్సర్ ఉందని భయపెట్టారు. ఆ తర్వాత టీబీ ఉందని నిర్దారించి, క్షయ వ్యాధిని నయం చేస్తామని రూ. 70 వేలు వసూలు చేశారు. అయినా రోగం నయం కాకపోవడంతో మేడ్చల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి స్వాతిని తీసుకువెళ్లగా, లీలా ఆసుపత్రి రిపోర్టులనే పరిగణనలోకి తీసుకుని టీబీ కోసం మందులు రాసిచ్చారు. ఆ మందులు వాడిన రెండు, మూడు రోజులకే స్వాతికి రియాక్షన్ అయ్యింది.

చర్మం ఊడిపోవడం.. ముఖం పై పొక్కులు రావడంతో స్వాతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను నిమ్స్ తో సహా పలు ఆసుపత్రులకు తీసుకువెళ్లిన వైద్యం చేసిందుకు నిరాకరించారు. కుటుంబ సభ్యులు వ్యయప్రయాసాలకోర్చి సంప్రద అనే ప్రైవేట్ ఆసుపత్రిలో రూ. లక్షలు వెచ్చించి, రియాక్షన్ వల్ల క్షీణించిన అనారోగ్యం నుంచి స్వాతి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇలా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు కాసుల కక్కర్తితో రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వైద్యసేవల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. లేని రోగాన్ని ఉన్నట్లు నమ్మిస్తున్నారు. రోగి కండిషన్ చెప్పకుండా లక్షల రూపాయాలు తీసుకుంటూ.. చివరి నిమిషంలో హడావిడి చేసి మరో ఆసుపత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నాయి.

జిల్లాలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల దందాకు అడ్డు లేకుండా పోతుంది. ఆసుపత్రిలో చేరిన రోగి నుంచి ఎంత వీలైతే అంత దోచేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చిన్నపాటి సమస్యతో వెళ్లినా అనేక పరీక్షలు చేసి రోగుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. పొరపాటున ఆరోగ్యం ఇబ్బందిగా ఉండి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే. పరిస్థితి మరింత దారుణం. రూ. లక్షలు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఉదంతాలు జిల్లాలో భారీగా వెలుగు చూస్తున్నాయి. రోజుల తరబడి వైద్యం చేయడం, రూ. లక్షలు వసూలు చేయడం, చివరి నిమిషంలో అత్యవసర వైద్యం పేరుతో మరో ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకోవడం ప్రైవేటు ఆసుపత్రులకు పరిపాటిగా మారింది. ఈ ఆసుపత్రులతో జరుగుతున్న వ్యవహారాలను నిత్యం పర్యవేక్షించాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఆసుపత్రి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నాయి.

ఠాగూర్ సినిమాను మరిపించేలా..

కొన్నాళ్ల కిందట వచ్చిన ఠాగూర్ సినిమా గుర్తింది కాదా.. ఆ సినిమాలో చనిపోయిన వ్యక్తికి ఓ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు చికిత్స చేస్తారు. రోగికి అత్యవసరంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు సీన్ క్రియేట్ చేసి, చివరకు ఎంత ప్రయత్నించినా ప్రాణం కాపాడలేకపోయమంటూ సమధానమిస్తారు. అయితే అక్కడ హిరో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాడు. మేడ్చల్ పట్టణంలో లీలా ఆసుపత్రిలో ఈ తరహా సీన్ జరిగింది. చిన్నపాటి అవస్థతో వైద్యం కోసం వచ్చిన స్వాతిని కండిషన్ సీరియస్ గా ఉందని ఐసీయూలో చేర్పించారు. ఒకసారి క్యాన్సర్ ఉందని భయబ్రాంతులకు గురి చేశారు. ఆ తర్వాత క్యాన్సర్ కాదని టీబీ ఉందని భయపెట్టి వైద్యం పేరిట రూ. 70 వేలకు పైగా దండుకున్నారు. తీరా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ సెంటర్ కు వెళ్తితే మందులిస్తారని చెప్పారు. టీబీ సెంటర్ కు వెళ్లిగా అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సూపర్వైజర్ జైహింద్ రెడ్డి తెమడ (టీబీ కోసం)పరీక్షల కోసం చాంపిల్స్ తీసుకున్నాడు. రోగ నిర్దారణ పరీక్షల నివేదిక రాకుండానే జహింద్ రెడ్డి అప్పటికే లీలా ఆసుపత్రి వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం టీబీ వ్యాధి కోసం మందులు ఇచ్చాడు. ఆ మందులను వాడడంతో స్వాతికి రియాక్షన్ అయ్యింది. వారం రోజుల తర్వాత ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరోసారి లీలా ఆసుపత్రికి వెళ్లగా, తమ వల్ల కాదంటూ చేతులేత్తేశారు.

దీంతో తన భార్య ప్రాణాలను రక్షించుకునేందుకు నిమ్స్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినా వైద్యానికి ఆమె కండిషన్ సీరియస్ ఉందని వైద్యానికి నిరాకరించాయి. దీంతో ఎట్టకేలకు సంప్రద ఆసుపత్రిలో చేరి రూ.2 లక్షలకుపైగా వైద్యం కోసం వెచ్చించి స్వాతి ప్రాణాలను రక్షించుకున్నారు. ఆ తర్వాత సెకండ్ ఒపినియన్ కోసం పలు ఆసుపత్రులకు వెళ్లి టీబీ పరీక్షలు నిర్వహించగా, టీబీ లేదని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన స్వాతి సోమవారం కలెక్టరేట్ లోని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.రఘునాథ స్వామిని కలిసింది. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. తాను తీసుకున్న ట్రీట్ మెంట్ తో పాటు తాజా వైద్య పరీక్షల రిపోర్టులను డీఎంహెచ్ఓకు చూపించింది. అయితే పరిశీలించిన రఘునాథ స్వామి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నప్పుడే తనను సంప్రదించి ఉంటే న్యాయం చేసే వారమని, ఇప్పుడు మోసం చేసిన లీలా ఆసుపత్రి నుంచి డబ్బులు ఇప్పించడం కష్టమని చెప్పారని బాధితురాలు స్వాతి వాపోయారు.

న్యాయం చేయండి..స్వాతి

తనకు లేని రోగాన్ని అంటగట్టి రూ. లక్షలు నష్ట పరిచిన ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలి. తనను శారీరంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి తన కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా చేసిన ఆసుపత్రి యాజమాన్యం నుంచి తనకు నష్ట పరిహారం ఇప్పించాలి. పేద ప్రజల మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆసుపత్రులలో ఇచ్చి మందులే రియాక్షన్ అయినందున సమగ్ర విచారణ జరిపించి, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed