ఆ మంత్రి దత్తత వార్డులో ప్రభుత్వ భూమి కబ్జాలు, అక్రమ నిర్మాణాలు..

by Kalyani |
ఆ మంత్రి దత్తత వార్డులో ప్రభుత్వ భూమి కబ్జాలు,  అక్రమ నిర్మాణాలు..
X

దిశ, శామీర్ పేట: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి దత్తత వార్డు అయిన మల్లన్న కాలనీ పరిధిలో ప్రభుత్వ భూముల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు, కబ్జాలు కొనసాగుతున్నా మున్సిపాలిటీ అధికార యంత్రాంగం, రెవిన్యూ అధికారులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

వైస్ చైర్మన్ వార్డులోనే భారీగా అక్రమ నిర్మాణాలు..

మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయంజాల్లోని మంత్రి మల్లారెడ్డి దత్తత తీసుకున్న వైస్ చైర్మెన్ వార్డులోనే ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసి జోరుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. రియాల్టర్లు 80 గజాల నుంచి 100 గజాల వరకు ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. మంత్రి మల్లారెడ్డి దత్తత తీసుకున్న వార్డులోనే ప్రభుత్వ భూములను అధికారులు కాపాడలేకపోతున్నారంటే వేరే ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను అధికారులు ఎలా కాపాడతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై మొద్దు నిద్రలో ఉన్న టౌన్ ప్లానింగ్ అదికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


ఇది ఇలా ఉండగా ఈ విషయమై ఆర్ఐ కుమార్ ను వివరణ కోరాగా ‘ఎలాంటి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో వాటి ఫోటోలు పంపించండి. వెంటనే మా సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పడం జరిగింది. వివరణ అడిగిన వారే ఫోటోలు , లొకేషన్ పెడితే తప్ప అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే ఎంత నిర్లక్ష్యంగా అధికార యంత్రాంగం పని చేస్తుందనే విషయం తెలిసిపోతుంది.

Advertisement

Next Story