Family Digital Card: అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్.. లాంఛనంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

by Shiva |   ( Updated:2024-10-03 05:43:42.0  )
Family Digital Card: అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్.. లాంఛనంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
X

దిశ, మేడ్చల్ బ్యూరో: సంక్షేమ పథకాలకు ఇతర అవసరాలకు అన్నింటికీ ఒకే గొడుగు కింద తీసుకువస్తూ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందజేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 23న ఇది అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ తరహా డిజిటల్ కార్డు‌లపై అధికారులు అధ్యయనం చేశారు. ఆయా రాష్ట్రాలలో ఈ కార్డుల జారీ అంశంలో ఇబ్బందులు అదేవిధంగా కుటుంబాలకు కలిగే ప్రయోజనాలపై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. సుదీర్ఘ సమీక్ష అనంతరం గురువారం లాంఛనంగా పైలట్ ప్రాజెక్ట్‌ను సీఎం అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటే..

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వపరంగా లభించే అన్ని రకాల సంక్షేమ పథకాలకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. వన్ స్టేట్.. వన్ కార్డ్ నినాదంతో ఈ డిజిటల్ కార్డును అందజేయనున్నారు. రేషన్, ఆరోగ్య, సంక్షేమ పథకాలు అన్నింటిని ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించే విధంగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను రూపొందించడం. లబ్ధిదారులు ఎవరైనా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా అవకాశం కల్పించనున్నారు. ఈ డిజిటల్ కార్డులో కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యునికి చెందిన హెల్త్ ప్రొఫైల్ ఉండేలా చూస్తున్నారు.

దీంతో దీర్ఘ కాలంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వపరంగా వైద్య సేవలను పొందే విధంగా రూపొందిస్తున్నారు. డిజిటల్ ఫ్యామిలీ కార్డు జారీ అయిన అనంతరం ఏ సమయంలోనైనా మార్పులు చేర్పులు చేసుకునే విధంగా అవకాశం కల్పించనున్నారు. రాజస్థాన్ లో జన్ ఆధార్ స్కీం పేరిట టెన్ డిజిట్స్ సంఖ్యతో ఫ్యామిలీ ఐడి ని జారీ చేయగా సభ్యులకు 11 డిజిట్స్ సంఖ్యతో ఐడిని జారీ చేశారు. అదేవిధంగా హర్యానాలో పరివార్ పే హెచాన్ పత్రి పేరిట ఎనిమిది సంకెల యూనిట్ నెంబర్ను కుటుంబాలకు కేటాయించగా, కర్ణాటకలో కుటుంబ్ ఐడి పేరిట 12 సంఖ్యల ఐడిని కేటాయించడం జరిగింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా రేషన్ కార్డ్ ఐడి గా 12 సంఖ్యల ఐడిని ప్రతి కుటుంబానికి ఇచ్చారు.

ఎలా చేస్తారంటే..

ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణించి కుటుంబానికి ఒకే కార్డు కుటుంబ సభ్యులకు ఒక ఐడి నెంబర్ జారీ చేస్తారు. ముగ్గురు లేదా నలుగురు సభ్యులతో ఒక బృందం ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తారు. వీరిపై పర్యవేక్షణగా ఎంపీడీవో లేదా తాసిల్దార్ లేదా ఆదేస్తాయి హోదా కలిగిన అధికారి ఉంటారు. వీరందరూ ఆర్డిఓ లేదా జోనల్ కమిషనర్ నేతృత్వంలో పనిచేస్తారు.

సేకరించే వివరాలు ఇవే..

ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ కోసం ఆయా కుటుంబాల నుంచి కొన్ని వివరాలను సేకరిస్తారు సర్వే బృందం. ఇందులో భాగంగా కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేరు, జెండర్, పుట్టిన తేదీ, వయసు, కుటుంబ పెద్దతో ఉన్న సంబంధం, ఆధార్ నంబర్, అడ్రస్ వివరాలు సేకరిస్తారు. ప్రతి కుటుంబంలో కుటుంబ పెద్దగా ఆ కుటుంబానికి చెందిన మహిళ పేరును హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పరిగణిస్తారు. ఫ్యామిలీ మొత్తానికి ఒకే రకమైన గుర్తింపు సంఖ్యను (ఫ్యామిలీ ఐడి) ఇవ్వడంతో పాటుగా, కుటుంబంలో ఉన్న ఒక్క వ్యక్తికి పర్సనల్ ఐడి ని జారీచేస్తారు. వివరాలు సేకరించిన అనంతరం కుటుంబ సభ్యుల ఫోటోలు క్యాప్చర్ చేయడం జరుగుతుంది.

నేడు లాంఛనంగా..

గత నెల చివరి వారంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టును గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక వార్డు లేదా ఒక గ్రామం పరిధిలో ఉన్న కుటుంబాలను సర్వే చేస్తారు. రోజుకు 40 కుటుంబాలు సర్వే చేసే విధంగా టార్గెట్ రూపొందించుకొని 5 రోజుల్లోగా పైలెట్ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు.

Advertisement

Next Story

Most Viewed