అక్కడంతా ఆమ్యామ్యాలే..!

by Sumithra |
అక్కడంతా ఆమ్యామ్యాలే..!
X

దిశ, మేడ్చల్ బ్యూరో : డ్రైవింగ్ లైసెన్సా..? రెన్యువలా...? కొత్త బండి రిజిస్ట్రేషనా..? ఇలా తిరుమలగిరిలోని సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీసులోకి అడుగు పెట్టగానే ఏజెంట్లు దర్శనమిస్తున్నారు. ఆర్టీఏ ఆఫీసుకు ఏ పని కోసం వెళ్లినా ముందుగా ఎదురయ్యేది ఏజంట్లే.. ఏం పని కావాలి..? ఏదైనా ఇట్టే చేసి పెడుతాం.. అంటూ ప్రశ్నలతో అక్కడికి వచ్చిన వారి వెంట పడుతారు. అయితే వాహనాల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్, లెర్నింగ్ లైసెన్స్ అన్నా కూడా ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవడం ద్వారానే అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతారు. కానీ సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీసులో అధికారులు, ఏజెంట్ల అండతోనే ఫైళ్ల క్లియరెన్స్.. లావాదేవీలు సాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంవీఐలదే హవా..!

ఆర్టీఏ కార్యాలయంలో కొన్ని నెలలుగా ఆర్టీవో అధికారి పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఇక్కడ పనిచేసే మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లదే (ఎంవీఐలు) వాహా నడుస్తోంది. వీరిలో ఒకరికి ఇన్ చార్జీ ఆర్టీవోగా అవకాశం ఇవ్వడంతో వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల జారీలో ఎంవీఐలది అడిందే అట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. కార్యాలయంలోని ఎంవీఐల కింద దాదాపు 30 మంది ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. కాగా 2016లో కేంద్రం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ కోసం షోరూమ్ లో పూర్తి రుసుం చెల్లించి, ఆర్టీఏ అధికారులు సూచించిన పత్రాలను, వాహనాన్ని చూపిస్తే. జీరో రశీదుతో శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి అధికారులు రకరకాల కోర్రిలు పెట్టి, వాహన రిజిస్ట్రేషన్లను చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏజెంట్ల వద్దకు వెళ్లితే ఏ పని అయినా ఈజీగా జరిగిపోతుందని అంటున్నారు.

2016 లోనే కేంద్రం మార్గదర్శకాలు..

కేంద్ర ప్రభుత్వం రహదారి భద్రత చట్టంలో వాహనదారులకు ఊరట కలిపించే అనేక అంశాలను పొందు పరిచింది. వాహనాల రిజిస్ట్రేషన్లను షోరూంలలోనే పూర్తి చేసేలా 2016 లోనే మార్గదర్శకాలను రూపొందించింది. ఏపీ సహా పలురాష్ట్రాలు ఈ సదుపాయాన్ని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో మొదట టీఆర్ తీసుకొని ఆ తరువాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియ ఏజెంట్లతో పాటు కొందరు అధికారుల అక్రమార్జనకు దోహదం చేస్తోంది.

వసూళ్ల దందా..

సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్లు వెళ్తేనే లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వారు అడిగినంత ఇస్తేనే రాకెట్ వేగంతో పనులు పూర్తవుతున్నాయి. ఇలా ఏజెంట్లు ఒక్కో ద్విచక్ర వాహనానికి రూ. 500 నుంచి రూ. వెయ్యి రూపాయాలు వసూలు చేస్తున్నారు. అదే ఫోర్ వీలర్ అయితే వాటి స్థాయిని భట్టి రూ.వెయ్యి నుంచి రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఏజెంట్ల ద్వారా రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దందా నడుస్తున్నట్లు సమాచారం. ఇద్దరు ఎంవీఐలు ఏజెంట్ ఎన్ని ఫైళ్లు తీసుకువచ్చారు..? ఎవరి వాటా ఎంత అనేది తెల్చుతారట. ఆ ఇద్దరు ఎంవీఐలే కింది నుంచి పై స్థాయి వరకు ‘వడ్డింపులు’ చేస్తారని కార్యాలయంలోని ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు.

ఎల్ఎల్ఆర్ కు వసూళ్లే..!

లెసెన్స్ ల కోసం వెళ్లే వాహనదారులు ముందుగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి. ఎల్ఎల్ఆర్ కు 450 రూపాయాలు ఖర్చవుతోంది. అయితే ఇక్కడ మాత్రం అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఏజెంట్లకు చెల్లించాలి. ఏజెంట్లకు డబ్బులు ఇవ్వగానే వాహన పరీక్ష (డ్రైవింగ్ టెస్ట్) ఈజీగా పాస్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధార్ కార్డు, పదో తరగతి మెమో లేకున్నా.. కొందరు ఏజెంట్లు లైసెన్సులు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఫైలు కదిలే ప్రతీ టేబుల్ వద్ద ముడుపులు తప్పనిసరిగా చెల్లించుకోవాల్సిన దుస్థితి ఉందని వాహనదారులు వాపోతున్నారు. ఇక్కడ 10 మంది సీఎఫ్ కలెక్టర్లు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఈ కార్యాలయంలోని పరిస్థితిని ‘దిశ’ ప్రతినిధి ఆరా తీస్తే వాహనదారులు, లైసెన్స్ దారులంతా ‘ముడుపులు’ ఇవ్వకపోతే పని కాదని.. ఈ ఆర్టీఏ కార్యాలయంలో సర్వసాధారణమై పోయిందని చెబుతున్నారు.

Advertisement

Next Story