ఒకే రోజు అమీర్​పేట్, కూకట్​పల్లిలో విద్యార్థుల ఆందోళన...

by Sumithra |
ఒకే రోజు అమీర్​పేట్, కూకట్​పల్లిలో విద్యార్థుల ఆందోళన...
X

దిశ, కూకట్​పల్లి : మూడు సంవత్సరాల కోర్సు, ఇంటర్​ ఏదైనా గ్రూప్​ చదువుకున్న ఒకేషనల్​ కోర్సులలో శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగం కల్పిస్తామని నమ్మించి ఏఐఎంఎంఎస్​ (అమృత ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ అండ్​ మెడికల్​ సైన్స్​) ఇనిస్టిట్యూట్​ తమను మోసం చేసిందని ఆరోపిస్తు విద్యార్థులు వంద మంది సోమవారం కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ ముందు ఆందోళన చేపట్టారు. బాధిత విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్​పల్లి భాగ్యనగర్​ కాలనీ సప్తగిరి కాంప్లెక్స్​లోని మూడవ అంతస్థులో ఏఐఎంఎంఎస్​ (అమృత ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ అండ్​ మెడికల్​ సైన్స్​) ఇనిస్టిట్యూట్​ పేరుతో గత మూడు సంవత్సరాల క్రితం సంస్థను ఏర్పాటు చేశారు. వీరికి కూకట్​పల్లితో పాటు అమీర్​పేట్, మెహిదీపట్నం ప్రాంతాలలో బ్రాంచీలు ఉన్నాయి. ఏఐఎంఎంఎస్ ఇనిస్టిట్యూట్​లో పారామెడికల్​ డిగ్రీ, డిప్లొమ కోర్సులు అందిస్తున్నట్టు, అందులో బివోక్–రేడియాలజి అండ్​ మెడికల్​ ఇమేజింగ్​, బివోక్​– మెడికల్​ లాబ్​ టెక్నాలజి, బివోక్​–కార్డియక్​ కేర్​ టెక్నాలజి, బీవోక్​–ఆపరేషన్​ థియేటర్​ టెక్నాలజి, బివోక్​–ఆప్టోమెటరి టెక్నాలజి, బివోక్​–డయాలసిస్​ టెక్నాలజి కోర్సులు మూడు సంవత్సరాల కాలపరిమితి, ఇంటర్ అర్హత ఉన్న వారికి శిక్షణ ఇస్తామని నమ్మించి కోర్సులలో జాయిన్​ చేసుకున్నారు.

కోర్సులలో చేరుతున్న సమయంలో తమ ఇన్​స్టిట్యూట్​కు యూజిసి, గవర్నమెంట్​ ఆఫ్​ ఇండి రికగ్నైజేషన్​ సర్టిఫికేట్​ ఉంది, వంద శాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మించారు. ఇదిలా ఉండగా మెహిదిపట్నం బ్రాంచిలో విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం వెళితే ఏఐఎంఎంఎస్ సంస్థ నుంచి తీసుకున్న సర్టిఫికేట్​లు వాలిడ్​ కావని, ఇనిస్టిట్యూట్​కు రిజిస్ట్రేషన్​ లేదని తేలడంతో మెహిదిపట్నం, అమీర్​ పేట్​ బ్రాంచిలలో గొడవ జరిగింది. గత వారం రోజులుగా రెండు బ్రాంచిలతో పాటు ఆ సమాచారం అందుకున్న కూకట్​పల్లి బ్రాంచి విద్యార్థులు తమ సర్టిఫికేట్​లు, డబ్బులు తిరిగి ఇవ్వండి ఏఐఎంఎంఎస్​లో తాము కొనసాగమంటు యాజమాన్యానికి విన్నవించుకుంటు వస్తున్నారు. దీంతో సోమవారం సంస్థ కార్యాలయంలో విద్యార్థులు ప్రిన్సిపాల్, సిబ్బందిని నిర్భందించడంతో వారు 100 నంబర్​కు డయల్​ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థ ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​కు చేరుకున్నారు. కోర్సులో చేరిన వారికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా కౌన్సిలింగ్​ నిర్వహించారని, ఒకరి వద్ద ఏడాదికి 65 వేలు, 70 వేలు, 80 వేలు, లక్షల రూపాయల వరకు ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేసినట్టు విద్యార్థులు తిలోత్తమ, అనురాధలు ఆరోపించారు.

కూకట్​పల్లి బ్రాంచిలో మొత్తం సుమారు మూడు వందల మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ఏంటా అని భయపడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో పాటు వారి తల్లి తండ్రులు పోలీస్​ స్టేషన్​కు చేరుకుని పోలీస్​ స్టేషన్​ ఆవరణలో గంటల కొద్ది వేచి చూశారు. విద్యార్థుల నుంచి స్వీకరించిన ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని సీఐ ముత్తు తెలిపారు. కాగా ఈ నెల 25వ తేది నాడు తమ సంస్థ చైర్మన్​ అల్లాబక్ష్ వస్తున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారిని సముదాయిస్తాము సమయం ఇవ్వాలని ఏఐఎంఎంఎస్ సంస్థ ప్రిన్సిపాల్​ ఝాన్సి పోలీసులతో కోరారు. ఇదిలా ఉండగా కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో విద్యార్థుల ఆందోళన కార్యక్రమం, ఫిర్యాదు తతంగం జరుగుతుండగా అదే సమయంలో అమీర్​పేట్​ బ్రాంచిలో విద్యార్థులు గొడవ చేయడం పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో ఏఐఎంఎంఎస్​ సంస్థ చైర్మన్​ అల్లాబక్ష్​ మరి కొంత మంది సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. దీంతో కూకట్​పల్లి పోలీసులు పంజాగుట్ట పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అనే విషయాన్ని వాకబు చేస్తున్నారు. ఏఐఎంఎంఎస్​ సంస్థ పై తాము ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed