బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం

by Disha Web Desk 23 |
బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం
X

దిశ,ఘట్కేసర్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఘట్కేసర్ మున్సిపాలిటీ కేంద్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మంగళవారం మూడు క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని బియ్యం స్వాధీనం చేసుకున్న 24 గంటల్లోపే బుధవారం 25 క్వింటాళ్ల బియ్యం రవాణా చేస్తున్న వాహనాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఘట్కేసర్ ఎస్సై రాము కథనం ప్రకారం... ఘట్కేసర్ మున్సిపాలిటీ యంనంపేట చౌరస్తాలో నెంబర్ ప్లేట్ లేని అశోక్ లేలాండ్ వాహనం అనుమానాస్పదంగా లోడుతో వెళ్తుండగా గుర్తించిన స్థానిక యువకులు ఘట్కేసర్ ఎస్సై రాముకు సమాచారం అందించారు.

వెంటనే ఎస్ఐ యంనంపేట చౌరస్తా పరిధిలో గస్తీలో ఉన్న పెట్రోలింగ్ కానిస్టేబుల్ శ్యామ్ కు పీడీఎస్ రైస్ తరలిస్తున్న వాహనం వివరాలు తెలిపి వాహనాన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఐ ఆదేశాల మేరకు పెట్రోలింగ్ కానిస్టేబుల్ శ్యామ్ పీడీఎస్ రైస్ తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కీసర మండలం తుర్కపల్లికి చెందిన రాజేందర్ ఉమ్మడి ఘట్కేసర్ మండల పరిధిలోని రేషన్ షాపుల వద్ద కాపు కాసి రేషన్ షాప్ లో నుంచి బియ్యం తీసుకున్న వినియోగదారులకు కిలోకు రూ.10 చొప్పున చెల్లించి ఆ బియ్యాన్ని మోటార్ సైకిళ్లపై రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డంప్ చేసి, అక్కడ నుంచి భారీ వాహనాలలో కామారెడ్డి, గజ్వేల్ ప్రాంతాలలో రైస్ మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై రాము తెలిపారు.

Next Story

Most Viewed