ప్లానింగ్‌తో దోపిడిలు.. చోరీ డబ్బు డిపాజిట్ చేస్తూ అడ్డంగా బుక్..

by Hajipasha |   ( Updated:2022-11-25 13:54:10.0  )
ప్లానింగ్‌తో దోపిడిలు.. చోరీ డబ్బు డిపాజిట్ చేస్తూ అడ్డంగా బుక్..
X

దిశ, పేట్ బషీరాబాద్: చోరీ సొత్తును దాచుకుందామనుకున్నాడు.. అందులో కొంత నగదును తన ఖాతాలో డిపాజిట్ చేసుకున్నాడు.. అప్పటికే సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని అడుగడుగునా పరిశీలిస్తున్న పోలీసులు బ్యాంకులో డిపాజిట్ చేసిన దృశ్యాలు ఆధారంగా కేసును చేదించి నిందితుడి వద్ద నుంచి ఆరు లక్షల విలువచేసే నగదును ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

పేట్ బషీరాబాద్ ఏసిపి రామలింగరాజు వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కాశీ బుగ్గకు చెందిన నాగేల్లి హేమంత్ సాయి (19) ఈనెల 16న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెన్నెల గడ్డ బౌద్ధ నగర్ సాయిబాబా టెంపుల్ సమీపంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి బీరువాలో దాచుకున్న రూ 4.20 లక్షల దోచుకొని వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు పై దృష్టి సారించి కేవలం వారం రోజుల్లో కేసును చేదించారు.

బ్యాంక్‌లో డిపాజిట్ చేసి అడ్డంగా దొరికాడు..

నిందితుడు నాగేళ్లి హేమంత్ సాయి ఈ నెల 16న ఇంటి తాళం పగులగొట్టి నగదును చోరీ చేశాడు. చోరీ చేసిన తర్వాత అతను వివిధ మార్గాల ద్వారా పేరడైజ్ లో ఉన్న ఎస్బిఐ బ్యాంకులో చోరీ చేసిన సొత్తులో నుంచి రూ 40 వేలను డిపాజిట్ చేసుకున్నాడు. అంతకు ముందు నుంచి నిందితుడి ప్రతి అడుగును సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన అనంతరం తొలుత అతను సుచిత్ర చౌరస్తాలో ఆటోలో అల్వాల్ కి వెళ్ళాడు. సీసీ కెమెరాలు ఆధారంగా పరిశీలిస్తున్న పోలీసులకు ఆటోలో నిందితుడికి వెళ్లినప్పటికీ ఆటోపై నెంబర్ లేకపోవడంతో గుర్తించడం కష్టమైందని తెలిపారు.

అయితే అదే సమయంలో ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి అదే ఆటోలో వెళ్లడం గుర్తించారు. ఆ బైక్ నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తులను విచారించగా ఆ ఆటోలో ఉన్న వ్యక్తి ఎక్కడ దిగాడో తెలుసుకున్నారు. తిరిగి ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తూ ఉండగా నిందితుడు ప్యారడైజ్ లో ఉన్న బ్యాంకు కి వెళ్లడం గమనించారు. నిందితుడు బ్యాంకులో నగదు జమ చేయడం బయటకు రావడం వంటి వాటిని పరిశీలించిన పోలీసులు ఏ ఖాతాలో నగదును జమ చేశాడు అన్న విషయం తెలుసుకున్నారు. దాని ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి నాలుగు లక్షల నగదును, ఆరు లాప్టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.

మైనర్‌గా జువైనల్ హోమ్‌కి వెళ్ళిన మారని తీరు

చోరీ నిందితుడు హేమంత్ సాయి 2018 సంవత్సరంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో రెండు చోరీలకు పాల్పడ్డాడు. అదే సమయంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి మైనర్ కావడంతో అతని జువైనల్ హోమ్ లో ఉంచారు. జువైనల్ హోమ్ నుంచి తిరిగి వచ్చిన హేమంత్ సాయి అల్వాల్ లో ఉన్న ఓ హోటల్లో తన బంధువు ద్వారా పనికి కుదిరాడు. ఖాళీ సమయంలో అతను తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి వాటిని పగలగొట్టి చోరీలకు పాల్పడుతుంటాడు. ఇదే క్రమంలో తాజాగా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు జోరీలు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోరీలకు పాల్పడ్డాడు. తాళాలు పగలగొట్టడం ఇబ్బంది అయితే కిటికీల ద్వారా అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను తస్కరించడంలో హేమంత్ సాయి నేర్పరి.

ముందు జాగ్రత్తగా చేతికి గ్లౌజులు ముఖానికి మాస్క్

నిందితుడు హేమంత్ సాయి దొంగతనం చేసిన సందర్భంగా చాలా జాగ్రత్తలు పాటిస్తాడని పోలీసులు పేర్కొన్నారు. దొంగతనానికి వెళ్లిన సందర్భంలో ముఖానికి మాస్క్ పెట్టుకుంటాడు. తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లే సమయంలో వేలిముద్రలు పడకుండా చేతికి గ్లౌజులు ధరించి జాగ్రత్త పడతాడు. ఇలా చేయడం వలన 2018లో చోరీ కేసులో జైలుకు వెళ్లిన హేమంత్ సాయి రికార్డులు పోలీసులు వద్ద ఉన్నప్పటికీ అతను దొరకలేదు. ఆఖరికి నిందితుడి ప్రతి అడుగును సీసీ కెమెరాల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి అతన్ని అరెస్టు చేయడమే కాకుండా అతని వద్ద నుంచి తాజాగా చోరీ చేసిన సొత్తును మొత్తం రికవరీ చేశారు పెట్ బషీరాబాద్ పోలీసులు. నిందితుడిని పట్టుకోవడంలో తీవ్రంగా శ్రమించిన సీసీటీవీ కెమెరా స్టాఫ్ సురేష్ తో పాటుగా డి ఎ లక్ష్మీనారాయణ రెడ్డి, సీఐ ప్రశాంత్, సిబ్బందికి ఉన్నత అధికారులు చేతుల మీదుగా రివార్డును అందించినట్లు ఏసీపీ రామలింగరాజు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed