కబ్జాకు గురైన కోమటికుంట.. పట్టించుకోని అధికారులు..

by Sumithra |
కబ్జాకు గురైన కోమటికుంట.. పట్టించుకోని అధికారులు..
X

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న కోమటికుంట అన్యాక్రాంతానికి గురవుతుంది. ఆక్రమణకు గురవుతున్న కోమటికుంటను కాపాడాల్సిన అధికారులే చోద్యం చూస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే నర్సాపూర్ పట్టణంలోని చౌరస్తా సమీపంలోని తూప్రాన్ రోడ్ లో ఉన్న కోమటికుంట రోజురోజుకు అన్యాక్రాంతం అవుతుంది. యదేచ్ఛగా కబ్జా చేసి నిర్మాణాలు చేసినప్పటికి కాపాడాల్సిన అధికారులు నిద్రమత్తులో తూగుతున్నారు. నర్సాపూర్ నుంచి తూప్రాన్ వెళ్లే రూట్ లో జాతీయ రహదారి ప్రధాన పక్కనే కోట్లాది రూపాయలు విలువచేసే కోమటికుంట ఆక్రమణ పై పట్టణ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణం దినదినాభివృద్ధి చెందడంతో ఇక్కడ స్థలం రోడ్డు పక్కన వేలల్లో ఉంటుంది.

దాంతో కోమటికుంట పై కన్నేసిన కొంత మంది అక్రమార్కులు యదేచ్చగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే కోమటికుంట విస్తీర్ణం 15 ఎకరాలు ఉండగా ప్రస్తుతం కేవలం 10 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కోమటికుంట కబ్జా పై పట్టణానికి చెందిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పంబళ్ల బిక్షపతి రెండు రోజుల క్రితం ఇరిగేషన్ ఏఈ మణి భూషణ్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఇరిగేషన్ ఎఈ కబ్జా చేసిన వారందరినీ గుర్తించి నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే కోమటికుంట ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్, బపర్ జోన్ లను సైతం కబ్జా చేసినట్లు తెలిసింది. సహజ సిద్ధమైన కోటికుంట వర్షాకాలంలో నీరుచేరి నిండుకుండలా మారి పక్కనున్న కాలనీవాసులకు వరంలా ఉంటుంది. ఎండాకాలం సైతం ఈ కుంట వల్లనే ఆ ప్రాంత వాసులకు భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటుంది.

కట్ట పక్కనే నిర్మాణాలు..

అయితే కట్ట పక్కన నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధన ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి యదేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. కట్ట పక్కన కచ్చితంగా 10 ఫీట్లు విడిచి నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు పాటించడం లేదు. కుంటపక్కనే డబ్బాలు వేసి కిరాయిలకు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా కోమటికుంట పరిధిలో ఓ ప్రైవేట్ పరిశ్రమకు చెందిన వారు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు.

కోమటికుంట సుందరి కరణ కోసం నిధుల కేటాయింపు..

అయితే నర్సాపూర్ పట్టణంలో నడి మధ్యలో ఉన్న కోమటికుంటను కాపాడాలని లక్ష్యంతో మున్సిపల్ పాలకవర్గం అధికారులు నిర్ణయించి నిధులు కేటాయించారు. కోమటికుంటను సుందరీకరణ చేసి వాకింగ్ ట్రాక్, తదితర నిర్మాణాలు చేపట్టి పట్టణ వాసులకు ఉపయోగపడేలా చేసి వినియోగం తేవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

వ్యర్థ పదార్థాలతో కంపు కొడుతున్న కోమటికుంట..

అయితే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కోమటికుంట పక్కనే ఉండే కాలనీవాసులు పక్కనే ఉన్న చెత్తచెదారాన్ని ఇష్టారీతిలో పెద్దఎత్తున కోమటికుంటలో పారబోయడంతో దుర్గంధం వెదజల్లి దోమలు ఈగలకు ఆనవాలుగా మారింది. ఈ వ్యర్థ పదార్థాలు ప్రధాన రోడ్డుపక్కనే ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోమటికుంట ఆక్రమణ పై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed