తహశీల్దార్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వికలాంగుడు.

by Disha News Desk |
తహశీల్దార్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వికలాంగుడు.
X

దిశ ప్రతినిధి, మెదక్: రెవెన్యూ అధికారుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఏసీబీకి పట్టుబడ్డ.. పలువురు రైతులు ఆత్మహత్య యత్నం చేసిన అధికారుల్లో మార్పు రావడం లేదు. అధికారుల తీరు పలు కుటుంబాల్లో చిచ్చు పెడుతుండగా.. మరికొన్ని కుటుంబాలను దూరం చేస్తున్నాయి. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి ఎమ్మార్వోలకు అప్పగించిన రెవెన్యూలో అవినీతి అంతం కావడం లేదు. వీఆర్వోలకు బదులు ఎమ్మార్వోలు లంచావతారం ఎత్తారన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తాజాగా చిన్నకోడూరు ఎమ్మార్వోపై ఓ వికలాంగుడు ఫిర్యాదు చేయడంతో తహశీల్దార్ల బాగోతం బహిర్గత మవుతుంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం చోటు చేసుకున్నాయి.

ఎమ్మార్వోపై వికలాంగుడు ఫిర్యాదు

తహశీల్దార్ చేష్టలతో విసిగిపోయిన దివ్యాంగులు ఏకంగా తహశీల్దార్ పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే చిన్నకోడూరు మండలం అనంతసాగర్ కి చెందిన రాజయ్య ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాడు. అనంతసాగర్ గ్రామంలో సర్వే నెం. 388, 389, 390, 391 సర్వే నెంబర్లలో 4-36 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రాజయ్యకు ఒక సోదరి కనకవ్వ, ఒక సోదరుడు లక్ష్ణయ్య (ప్రభుత్వ టీచర్) ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా రావాల్సిన భూమిని రాజయ్య సోదరుడు లక్ష్మయ్య ఒక్కడే తన పేరిట భూ రికార్డును అక్రమంగా మార్చుకున్నాడు. విషయం తెలుసుకున్న రాజయ్య చిన్నకోడూరు తహశీల్దార్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

పలు మార్లు ఎమ్మార్వో చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో వికలాంగుల రాష్ట్ర కమిషన్ ను ఆశ్రయించాడు. అదే విధంగా సిద్దిపేట ఆర్డీవోకు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది. ధరణి లోని చిన్న పాయింట్ ఆధారంగా రాజయ్య సోదరుడు లక్ష్మయ్య, చిన్నకోడూరు ఎమ్మార్వో శ్రీనివాసరావుతో కుమ్మక్కై తన అభ్యంతరాలను పట్టించుకోకుండానే వికలాంగుల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రియలెస్టేట్ వ్యాపారి నర్సింహారెడ్డికి విక్రయించారు. విషయం తెలిసిన తాను ఎమ్మార్వోను, సోదరున్ని ప్రశ్నించగా.. ఎవరికి చెప్పుకుంటావో .. చెప్పుకో అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన చిన్నకోడూరు ఎమ్మార్వో, రిజిస్ట్రేషన్ చేయించిన ప్రభుత్వ టీచర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తహశీల్దార్లదే హవా

మండల స్థాయిలో తహశీల్దార్ల హవా కొనసాగుతుంది. రెవెన్యూలో అవినీతి ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. అవినీతి ఆరోపణలో టాప్ స్థానం రెవెన్యూదే. అంతలా అవినీతి పేరుకుపోయిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను సబ్ రిజిస్ట్రారు తొలగించి ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఎమ్మార్వోలకు అప్పగించింది. అయినప్పటికి రెవెన్యూలో అవినీతి రూపుమాపడం లేదు. వీఆర్వోలకు బదులు తహశీల్దార్లు అవినీతికి తెరలేపారు. మొన్నటి వరకు వీఆర్వో, ఆర్ ఐ స్థాయిలో జరిగిన దందా నేరుగా ఎమ్మార్వో స్థాయిలో రెవెన్యూ అక్రమాలు కొనసాగుతున్నాయి.

జిల్లాలో ఇలాంటి పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు ఎమ్మార్వోలపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. పలువురు అధికారులు ఏసీబీలకు పట్టుబడ్డారు. అయినా అధికారుల్లో ఏ మాత్రం భయం తొలగడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే కేబినెట్ సమావేశం నిర్వహించి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునేందుకు, రెవెన్యూలో అవినీతిని అంతమొందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్న దాతలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed