వాటి కోసం ప్రజాప్రతినిధుల పైరవీలు.. తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు..

by Satheesh |
వాటి కోసం ప్రజాప్రతినిధుల పైరవీలు.. తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు..
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు, గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ఎమ్మెల్యేల వద్ద పైరవీలు చేస్తున్నారు.మొన్నటి వరకు కనపడని వారు ఇప్పుడు ఎమ్మెల్యేల వెంటనే తిరుగుతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు ప్రత్యేక నిధులు కేటాయించడమే ఇందుకు కారణం. తమ వార్డులో తాము చూపించిన పనులనే ఓకే చేయించాలని ఎమ్మెల్యేల వెంటపడుతున్నారు. ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలలో అవసరమైన పనులకే నిధులు వినియోగించుకోవాలని, వార్డుల్లో తిరిగి అందరి నిర్ణయం మేరకు చేపట్టాల్సిన పనులను గుర్తించాలని సీఎం కేసీఆర్​సూచించిన విషయం తెలిసిందే. ఇంకా పనుల గుర్తింపు మొదలు కాకపోయినప్పటికీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తాము చూపించిన పనులే గుర్తించాలని అధికారులు, మున్సిపల్​చైర్మన్లకు మీరే చెప్పాలంటూ ఎమ్మెల్యేలను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా ఎమ్మెల్యేల నివాసాలు ప్రజా ప్రతినిధులతో కిటకిటలాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పనుల గుర్తింపు ప్రక్రియ పెద్ద తలనొప్పిగా మారనున్నదని ఎమ్మెల్యేలు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

జిల్లాకు రూ.364.80 కోట్లు విడుదల..

అభివృద్ధి పనుల కోసం జిల్లాలోని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్​ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. గత నెల 21న నారాయణఖేడ్‌లో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిధులు కావాలని మంత్రి హరీష్​రావు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున.. సదాశివపేట, నారాయణఖేడ్, ఆందోల్, అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున రూ.125 కోట్లు, 699 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున కలిపి మొత్తం రూ.139.80 కోట్లను విడుదల చేస్తూ ఫిబ్రవరి 23న ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. హామీ ఇచ్చిన రెండు రోజుల్లోనే నిధులు కూడా మంజూరు చేయడంతో ప్రజా ప్రతినిధులు మురిసిపోయారు.

పనుల గుర్తింపు ఎలా..?

మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనుల గుర్తింపు ప్రక్రియపై అటు అధికారులు, ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీల పరిధిలోఎంపిక తలనొప్పిగా మారనున్నట్లు ఎమ్మెల్యేలు అంటున్నారు. మున్సిపాలిటీలకు చైర్మన్లు, పాలక వర్గాలు, పంచాయతీలకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఉన్నప్పటికీ సీఎం ప్రత్యేకంగా ఈ నిధులు కేటాయించిన నేపథ్యంలో పనుల గుర్తింపులో ఎమ్యెల్యేలే ఫైనల్​ చేయనున్నట్లు ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్​మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. దీనితో ఇక్కడ కౌన్సిలర్ల నుంచి ఎమ్మెల్యేలకు చాలా ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. డ్రైనేజ్, సీసీ రోడ్లు ఇతర పనులకు నిధులు కావాలని కౌన్సిలర్లు అభ్యర్థిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలతో వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పనుల గుర్తింపు చేపడితే ఇబ్బందులు వస్తాయని కౌన్సిలర్లు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. ఎన్నో పనులు ఉన్నాయి, ప్రజలంతా వచ్చి పలానా పనులే చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందంటున్నారు. ఈ క్రమంలో వార్డుల్లో పనులు ఫైనల్​చేయడం ఎలా అనే అంశంపై మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తర్జనబర్జన పడుతున్నట్లు సమాచారం. ఏ విధంగా, ఏఏ పనులు గుర్తించనున్నారో మున్ముందు చూడాల్సి ఉంటుంది.

ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల వార్డుల్లో..

పార్టీ కోసం ఎంతో ఖర్చు చేసుకుంటున్నాం. నిత్యం వార్డుల్లో జనం మధ్యలో ఉండి సేవలు అందిస్తున్నాం. తమ వార్డులో కాకుండా పక్కనే ఉన్న ప్రతిపక్ష కౌన్సిలర్​వార్డుకు ఎక్కువ నిధులు ఇస్తే కుదరదని ఇప్పటి నుంచే కౌన్సిలర్లు నేతలను హెచ్చరిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశాలు పెట్టి పనులు గుర్తిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. తాము గుర్తించిన పనులను ఒకే చేయాలని కౌన్సిలర్లు ఒత్తిడి తెస్తున్నట్లు టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ నాయకుడు చెప్పుకొచ్చారు.

అవసరమున్న పనులనే గుర్తించాలంటే అన్ని వార్డుల్లో అవసరమైన పనులే ఉన్నాయని, ఎన్ని కోట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు వేడెక్కిన ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీల పరిధిలో పనులు గుర్తింపు కత్తిమీద సాములా తయారైందంటున్నారు. ఇదిలా ఉండగా తమ వార్డుకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తే అవసరమైతే పార్టీలు మారతామని ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. పంచాయతీల్లో పెద్దగా ఇబ్బందులు ఏర్పడకపోయినప్పటికీనిధుల మంజూరు, పనుల గుర్తింపు ప్రక్రియ అంశాలు మున్సిపాలిటీల్లో ఇప్పుడు ఆసక్తిగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed