కోలుకున్న సంజీవన్‌రావుపేట్‌...

by Kalyani |
కోలుకున్న సంజీవన్‌రావుపేట్‌...
X

దిశ,నారాయణఖేడ్‌ : నీటి కలుషితం కారణంగా 50మంది వరకు అస్వస్థతకు గురైన నారాయణఖేడ్‌ మండలంలోని సంజీవన్‌రావుపేట్‌లో గ్రామస్తుల పరిస్థితి అదుపులోకి వచ్చింది. ముగ్గురు మాత్రమే స్వల్ప అస్వస్థతతో గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వచ్చారని శిబిరం ఇన్‌చార్జి డా. రాజేశ్వర్‌ తెలిపారు. ఖేడ్‌ ఏరియా ఆస్పత్రిలో సోమవారం ఇద్దరు, మంగళవారం ఐదుగురు డిచ్చార్జీ అయ్యారు. మరో 13 మంది చికిత్స పొందుతూ కోలుకున్నారని, వారందరి పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురురిలో ముగ్గురు, అక్కడి ప్రైవేట్‌ ఆస్పత్రిలోని ముగ్గురిలో ఇద్దరు డిచ్చార్జీ అయ్యారు. గ్రామంలో వైద్యశిబిరం కొనసాగుతుండగా ఇద్దరు వైద్యులు, ముగ్గురు ఏఎన్‌ఎంలు, ముగ్గురు ఆశాకార్యకర్తలు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతానికి గ్రామంలో పరిస్థితి అదుపులో ఉంది.

గ్రామస్థులతో గ్రామసభ

గ్రామ పరిస్థితిపై తహసీల్దార్‌ భాస్కర్, డిఎల్‌పీవో సంజీవరావు, గ్రామ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, వైద్యాధికారి సుశీల్‌ల ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను చర్చించారు. గ్రామంలో పందులు, కుక్కల బెడద విపరీతంగా ఉన్న విషయం దృష్టికి తెచ్చారు. పందుల పెంపకం దారులను సభలో పిలిచి పందుల సమస్య నివారించాలని సూచించగా ఐదురోజుల్లోపు తమ వ్యవసాయ క్షేత్రాల వద్ద గుడారాలు వేసుకొని తరలిస్తామని వాటి యజమానులు అధికారులు తెలిపారు. లేని పక్షంలో తాము నివారణకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. కుక్కల బెడద నివారిస్తామని చెప్పారు. పలు కాలనీలకు రోడ్లు, మురుగు కాల్వలు, ఒక విద్యుత్‌ స్తంభం తదితర సమస్యలను గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కాచి వడపోసిన నీటిని సేవించాలని, ఆరోగ్య జాగ్రత్తలగూర్చి వైద్యాధికారి డాక్టర్‌ సుశీల్‌ వివరించారు.

తక్షణం స్పందించాం.. రాజకీయం తగదుః ఎమ్మెల్యే

గ్రామంలో నెలకొన్న సమస్యలపై తక్షణం స్పందించి తాను అధికారులను అప్రమత్తం చేసి క్యాంపు ఏర్పాటు చేసి చికిత్సకు చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కొందరు రాజకీయం చేసి గ్రామంలో సమస్యలు సృష్టించాలని యత్నించారని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథలో నాణ్యతలేని పైపులు వేసి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. 50 హ్యాబిటేన్లు ఉంటే ఏఈలను నియమిచంకుండా ఒక్క ఏఈతోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెట్టుకువచ్చిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిషన్‌ భగీరథలో ఏఈలను నియమించి సక్రమ నీటిసరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Next Story