మంత్రి సభలో ప్రొటోకాల్ వివాదం

by Sridhar Babu |
మంత్రి సభలో ప్రొటోకాల్ వివాదం
X

దిశ, దుబ్బాక : మంత్రి సభలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. కాంగ్రెస్​ నాయకులు ప్రొటోకాల్​ పాటించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం దుబ్బాకలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో దుబ్బాక నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విచ్చేశారు. అలాగే మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ నియోజకవర్గ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని వేదికపైకి పిలవడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని వేదిక పైనుండి కిందికి దింపాలంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరగడంతో అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. నియోజకవర్గం ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వేదిక పైనే ఉండాలంటూ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో మంత్రి కొండా సురేఖ పలువురు లబ్ధిదారులకు త్వరగా చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Next Story

Most Viewed