నాడు ప్రామిసరీ నోట్లు...నేడు గాడ్ ప్రామిస్ లు

by Disha Web Desk 15 |
నాడు ప్రామిసరీ నోట్లు...నేడు గాడ్ ప్రామిస్ లు
X

దిశ,దుబ్బాక : మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ లను ఎంపీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట - భూంపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్ పి. వెంకట్రామిరెడ్డి తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3న 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలలో మహాలక్ష్మి, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, 4 వేల పింఛన్, తులం బంగారం ఇస్తామని మోసం చేశారని వివరించారు. కొత్త పథకాలు పక్కన పెడితే ఉన్న పథకాలు మూలన పడ్డాయన్నారు. కేసీఆర్ కిట్, రుణ మాఫీ, కౌలు రైతులు, కూలీలకు మోసం చేశారని వివరించారు.

కేసీఆర్ రెండు వేల పింఛన్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, సాగు, తాగు నీరు,కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఇవ్వలేదా, కూడవెల్లి వాగులోకి గోదావరి నీళ్లు విడుదల చేయలేదా అని వివరించారు. కాంగ్రెస్ హామీలను ప్రశ్నించిన కేసీఆర్ కండ్లు పీకేస్తా, పేగులు మెడలో వేసుకుంటా, చెడ్డి గుంజుతా అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం అంటే మనల్ని అవమాన పరిచినట్లు కదా అన్నారు. అందుకే వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. రాదు అనుకున్న తెలంగాణను ప్రాణాలకు తెగించి సాధించిన కేసీఆర్ ను మనం కాపాడుకోవలన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మాజీ కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి 100 కోట్ల తో ట్రస్టు ఏర్పాటు చేసి మీకు అండగా నిలుస్తారని అన్నారు. ఆయనకి ఘన విజయం అందించాలని కోరారు. అభ్యర్థులను చూసి ఓట్లెయ్యాలని కోరారు.

మీ సేవ కోసమే..రాజకీయాల్లోకి : ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి

ఎంపీ ఎన్నికల్లో ఓటేసే ముందు అభ్యర్థుల గుణ గణాలను చూసి, ఆలోచించి ఓట్లెయ్యాలని ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఫీజు కోసం వస్తే సహాయం చేశానన్నారు. కలెక్టర్ గా మీ సహకారంతో ఖ్యాతి తెచ్చామని, కేసీఆర్, హరీశ్ రావు ల ఆశీర్వాదంతో ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు.

నిరుపేద యువతీ యువకులకు ఉచితంగా కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, వృత్తి విద్యా శిక్షణ అందించి, జాబ్ మేళా ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే మెదక్ పార్లమెంటు పరిధిలో అర్హులైన వారికి 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి పేదలకు ఉచితంగా అందిస్తామన్నారు. ఎన్నికల సమయంలో అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వారిని నమ్మవద్దన్నారు. 13న జరిగే ఎన్నికల్లో 4వ నంబర్ మీద బటన్ నొక్కి ఓటేయాలన్నారు..

గల్లీ లో పనికిరాని వాడు ఢిల్లీలో పనికొస్తాడా : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

గల్లీ లో చిత్తుగా ఒడిపోయినోడు, ఢిల్లీ కి ఎలా పనికొస్తాడని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. మనం నిర్మించుకున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి నీళ్లు విడుదల చేసుకోవడానికి ధర్నాలు చేయాల్సి వచ్చిందన్నారు. మాజీ కలెక్టర్ గా విశేష పరిపాలనా అనుభవం ఉన్న వెంకట్రామిరెడ్డి కి ఘన విజయం అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రవి, సీనియర్ నాయకులు మనోహర్ రావు, సోలిపేట సతీష్ రెడ్డి, కత్తి కార్తీక, వెంకట నరసింహారెడ్డి, జెడ్పీటీసీలు కడతల రవీందర్ రెడ్డి, సుక్కురి లక్ష్మి లింగం , ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కైలాసం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed