పట్టు వదల్లే.. ఆశ చావలే.. శభాష్ అంజన్న

by Shiva |   ( Updated:2023-06-04 10:48:39.0  )
పట్టు వదల్లే.. ఆశ చావలే.. శభాష్ అంజన్న
X

హాట్సాఫ్ కలెక్టర్ రాజర్షీ షా

దిశ, చేగుంట : న్యాయంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన కల్యాణ లక్ష్మి చెక్కు కోసం ఆ వ్యక్తి అలుపెరుగని పోరాటం చేశాడు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో అమీ.. తుమీ తెల్చుకునేందుకు కలెక్టర్ కలిసి రావాల్సిన చెక్కును పోరాడి సాధించుకున్నడు అంజన్న. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి చేగుంట మండలానికి చెందిన పోతాన్ పల్లి గ్రామంలోని నిరుపేద వ్యక్తి గుల్ల ఆంజనేయులు.

ఇటివలే అతను తన కుమార్తె లక్ష్మీ భవాని వివాహాన్ని తూప్రాన్ మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామానికి చెందిన సంగుపల్లి ప్రశాంత్ తో గత సంవత్సరం ఏప్రిల్ 17న జరిపించారు. దీంతో ఆయన అందిరి లాగానే కళ్యాణ లక్ష్మి కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసిన సమయంలో జరిగిన పొరపాటుతో అడ్రస్ తప్పుగా రావాడంతో అందాల్సిన కల్యాణ లక్ష్మి చెక్కు రాకుండా పోయింది.

తన కుమార్తెతో పాటు వివాహం జరిగిన ఎంతో మంది అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి చెక్కు రాగా తన కుమార్తెకు మాత్రమే రాకపోవడంతో పంచాయతీ కార్యాలయం నుంచి మొదలుకొని రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. మీ సేవలో దరఖాస్తు చేసే సమయంలో అమ్మాయి మండలానికి బదులుగా అబ్బాయి మండలం నమోదు కావడంతో అధికారులు చెక్కు ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రజావాణిలో అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు మాత్రం కల్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వలేదు.

పట్టుదలగా పదే పదే కల్యాణ లక్ష్మి చెక్కు కోసం అంజయ్య కాల్లరిగేలా తిరగడం మొదలు పెట్టాడు. ఇటీవలే మెదక్ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ రాజర్షి షా వద్దకు వెళ్లి అంజన్న తనకు కళ్యాణ లక్ష్మి చెక్కు రాలేదంటూ సమస్యను సావధానంగా విన్నవించాడు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్షీ షా వెంటనే మాసాయిపేట్ తహసీల్దార్ మాలతికి సమాచారం అందించి వివరాలు తెలుసుకున్నారు.

అందుకు అనుగుణంగా కంప్యూటర్ రూంలోకి వెళ్లి తానే స్వయంగా కంప్యూటర్లో ఉన్న అడ్రస్ వివరాలను మార్చి కల్యాణ లక్ష్మి చెక్కు అందేలా ఆర్డర్ పాస్ చేశారు. సుమారు ఎనమిది నెలల పాటు కల్యాణ లక్ష్మి కోసం తిరిగి తిరిగి కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో చెక్కు రావడంతో అప్పటి వరకు చెక్కు రాదని భయపెట్టిన వారందరూ చెక్కు వచ్చేసరికి అవాక్కయ్యారు. ఈ విషయం చిన్నదే అయినా.. అంజన్న పోరాడి చెక్కు సాధించిన విధానం నలుగురికి స్ఫూర్తాదాయకంగా నిలిచిందని పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed