నిధులు రాక అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనం

by Aamani |
నిధులు రాక అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనం
X

దిశ, మనోహరాబాద్ : గత మూడేళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనానికి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. దీంతో గ్రామపంచాయతీ కార్యక్రమాలను ఓ అద్దె ఇంట్లో ఏర్పాటు చేసుకున్న వైనం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ కాళ్ళకల్ లో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం మాజీ సీఎం కేసీఆర్ ఇలాకలో ఉన్న కాళ్లకల్ గ్రామంలో పాడుబడ్డ శిధిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని గత నాలుగేళ్ల క్రితం కూల్చివేశారు. నూతనంగా జీపీ నిధుల ద్వారా 65 లక్షలతో నిర్మాణం చేపట్టారు.

ఇందులో ఉన్న గ్రామ పంచాయతీ కార్యక్రమాలను గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఉన్న రెండు గదులలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో విద్యార్థులకు గదుల కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నందున గ్రామపంచాయతీ ని ఓ అద్దె ఇంట్లో రెండు రోజుల క్రితం మార్చివేశారు. ఇదిలా ఉండగా రూ 65 లక్షలతో తాత్కాలికంగా నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనంలో జనవరి 31న స్థానిక సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించడానికి శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా పంచాయతీ భవనాన్ని ప్రారంభించడానికి సర్పంచ్, జడ్పి చైర్ పర్సన్ లు సిద్ధమయ్యారని అప్పటి జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో ప్రారంభం నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ప్రస్తుతం నూతనంగా అసంపూర్తిగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం వృధాగా ఉంది. ఈ భవనానికి కిటికీలు , బాత్రూంలో పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడంతో ముఖ్యంగా కాంట్రాక్టర్కు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో అసంపూర్తిగా వదిలేశారని గ్రామస్తులు తెలిపారు. తక్షణమే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గ్రామ పంచాయతీ భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి పంచాయతీ కార్యక్రమాలను కొనసాగించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed