నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు

by Naresh |   ( Updated:2024-03-13 09:58:45.0  )
నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సిద్దిపేటలో ఎంఈఓ యాదవ రెడ్డి, ఏ సీజీ ఈ లక్ష్మయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలోని 371 పాఠశాల నుంచి బాలురు 7036, బాలికలు 6,951, ఒక్కసారి ఫెయిల్ అయిన వారిలో బాలురు 3, బాలికలు 3 చొప్పున మొత్తం 13,987 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2 తేదీ వరకు జిల్లాలోని 80 పరీక్షా కేంద్రాల్లో ( 58 ప్రభుత్వ, 22 ప్రైవేటు పాఠశాలలు ) ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12: 30 వరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 1, 2వ తేదిల్లో 18 పరీక్షా కేంద్రాల్లో వొకేషనల్ విద్యార్థులు బాలురు 790 మంది, బాలికలు 871 మంది మొత్తం 1661 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులనే ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు ఉదయం 9 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మంచినీరు, ఫ్యాన్స్, ఫర్నిచర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ సారి ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు వేరువేరు రోజుల్లో జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాలలోకి సెల్ ఫోన్ అనుమతులు లేవని, విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం 7 గురు కస్టోడియన్, 7గురు రూట్ ఆఫీసర్లు, 80 మంది చీఫ్ సూపరింటెండెంట్ల, 80 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 46 మంది స్టోరేజ్ పాయింట్ సంరక్షకులు, 789 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

Advertisement

Next Story