బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం శూన్యం : మంత్రి హరీష్ రావు

by Vinod kumar |   ( Updated:2022-08-25 15:28:00.0  )
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం శూన్యం : మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట: సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నారాయణ రావు పేట మండల కేంద్రంలో 12 కోట్ల రూపాయల విలువైన 24 అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన విలేజ్ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించి నారాయణరావుపేట మండలం లో నూతనంగా మంజూరైన 569 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛనలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులం, మతం అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలను కేంద్రం వద్దంటున్న అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బడాబాబులపై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడం లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో కరువు తాండవం చేసిన నేలన నేడు కాళేశ్వరం జలసిరులతో చెరువులను నింపి సాగునీరు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. నారాయణరావు పేట మండలం లో 4,288 మందికి పింఛన్లు అందిస్తుండగా నూతనంగా మరో 569 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. దసరా నాటికి నూతన పింఛన్లు మంజూరు చేస్తామన్న మాట ప్రకారం మంజూరు చేసి మాట నేరవేర్చామన్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అదునాథ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. త్వరలో గుండె ఆపరేషన్, క్యాన్సర్ పేషెంట్ల కోసం రేడియోథెరపి, కీమోథెరపి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నారాయణరావు పేట మండలం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు శరవేగంగా చేస్తునట్లు తెలిపారు. రాములవారి గుడి నిర్మాణం పూర్తి చేయించేందుకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఆర్డివో అనంతరెడ్డి, నారాయణపేట ఎంపీపీ ఓగు బాలకృష్ణ, జెడ్పిటిసి కుంభాల లక్ష్మీ రాఘవరెడ్డి, సర్పంచ్ మాస శశి యాదగిరి, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed