పార్లమెంట్ భవనం నుండి శాసనసభకు : కొత్త ప్రభాకర్ రెడ్డి

by Sumithra |
పార్లమెంట్ భవనం నుండి శాసనసభకు : కొత్త ప్రభాకర్ రెడ్డి
X

దిశ, చేగుంట : ఢిల్లీ పార్లమెంట్ భవనం నుండి హైదరాబాద్ శాసనసభ భవనానికి కొత్త ప్రభాకర్ రెడ్డి పయనం అయ్యారు. దశాబ్దకాలంగా శాసనసభ్యుడిగా గెలుపొందాలనే కల ఆదివారం సాకారం అయ్యింది. 2014లో జరిగిన తొలి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో అవాంతరం ఏర్పడి బీఫామ్ పొందలేకపోయారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గజ్వేల్ నుండి ఎన్నికై ముఖ్యమంత్రి కాగా మెదక్ పార్లమెంటు స్థానాన్ని ఖాళీ చేసి కొత్త ప్రభాకర్ రెడ్డిని మెదక్ అభ్యర్థిగా నిలబెట్టారు. 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు సభ్యుడుగా భారీ మెజారిటీతో పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టాడు. దుబ్బాక శాసనసభ్యుడుగా ఉన్న రామలింగారెడ్డి అకాల మరణంతో 2020 ఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో ఉన్నప్పటికీ ఓటమిపాలైంది. దుబ్బాక ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జిగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్ని తానై వ్యవహరించారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు. పార్టీ ప్రచార కార్యక్రమంలో ఉండగా అక్టోబర్ 30వ తేదీన దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురై యశోద ఆసుపత్రిలో 20 రోజులపాటు చికిత్స పొందుతూ అక్కడే ఉన్నాడు. ప్రచారానికి సైతం రాలేని పరిస్థితుల్లో అతని సతీమణి మంజులత, కుమారుడు పృథ్వీ కృష్ణారెడ్డితో పాటు మంత్రులు హరీష్ రావు కేటీఆర్ మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్లు ప్రచార బాధ్యతను నెత్తిన మోశారు. చివరి రోజుల్లో ప్రచారానికి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక సభ నిర్వహించి పార్టీ శ్రేణులలో మరింత జోషుని నింపారు. నవంబర్ 30వ తేదీన జరిగిన ఓటింగ్లో ప్రజలంతా తన వైపే ఉంటారని ఆత్మవిశ్వాసాన్ని ప్రభాకర్ రెడ్డి వ్యక్తం చేశారు. అదే విషయం డిసెంబర్ మూడో తేదీన జరిగిన ఓటింగ్లో స్పష్టంగా బయటపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు పై 53,000 ఓట్ల పై చిలుకు ఆధిక్యంతో గెలవడంతో పార్లమెంట్ సభ్యులుగా ఉండి శాసనసభ్యులుగా ఎన్నికై త్వరలోనే శాసనసభ భవనంలోకి అడగు పెట్టబోతున్నాడు.

Advertisement

Next Story