సంగారెడ్డి సభలో ఖర్గే కామెంట్స్

by Sumithra |
సంగారెడ్డి సభలో ఖర్గే కామెంట్స్
X

దిశ బ్యూరో, సంగారెడ్డి/ సంగారెడ్డి : మెదక్ అంటే స్వర్గీయ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి ఎంతో ఇష్టమని, ఇక్కడి నుంచి పోటీ చేసే భారత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇక్కడ గెలిచి ఆమె ప్రధాన మంత్రి అయ్యారు. ఇందిర కృషితోనే బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడికి వచ్చారు. కాంగ్రెస్ సర్కారు పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఫోటోకు ఫోజులిస్తున్న దేశ ప్రధాని నరేంద్రమోడీ నిరుద్యోగుల జీవితాలతో ఆటలు అడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రలో భాగంగా ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడారు.

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సోలియాగాంధీ ఇచ్చారని, అప్పుడు కేసీఆర్ పరివారం మొత్తం వెళ్లి ఆమెతో ఫోటోలు దిగివచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కేసీఆర్ మోసం చేశారని ఖర్గే అన్నారు. తెలంగాణ ఇచ్చింది మరచిపోయి కాంగ్రెస్ ప్రభుత్వంపై అలాగే సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం పై ఖర్గే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చింది, పార్టీ ఎప్పుడు పేదల కోసం ఆలోచిస్తుంటుందన్నారు. భూసంస్కరణలు తీసుకురావడం, బ్యాంకులను జాతీయం చేయడం, 10 పాయింట్ల ప్రోగ్రాం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నదని ఖర్గే గుర్తు చేశారు. ఏడాదిలో 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ నిరుద్యోగులకు తెల్లకాగితాలు ఇచ్చారని విమర్శించారు. దేశంలో నరేంద్రమోడీ అందరినీ నిలువునా మోసం చేస్తున్నారని అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు..

ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ చేతిలో పెడితే రూ.5లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారని ఖర్గే విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో ఈ స్థాయిలో అప్పులు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. ఈ లక్షల కోట్ల అప్పులతో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలకు ఇలా ఏ వర్గానికి సీఎం కేసీఆర్ న్యాయం చేశారని ప్రశ్నించారు. ఎవరికీ ఎం చేయలేదని విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సి ఉన్నదన్నారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని, కర్నాటకలో గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే మీతో పాటు మా రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నాయకుల కూడా వస్తారని చురకలు అంటించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఖర్గే పిలుపునిచ్చారు.

జగ్గారెడ్డిని 50వేల మెజార్టీతో గెలిపించండి.. రేవంత్ రెడ్డి

డైనమిక్ లీడర్ జగ్గారెడ్డిని 50వేల మెజార్టీతో గెలిపించాలని, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి కీలక పాత్ర పోషిస్తారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంగారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 1980లో మెదక్ లో ఎంపీగా ఉన్నప్పుడు ఇందిరాగాందీ సభ నిర్వహించారు. ఇక్కడి నుంచి ప్రధాని అయ్యి ఎంతో చేశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం తీసుకువచ్చిన ఖర్గే వచ్చారని చెప్పారు. ఫించన్ ఎప్పుడొస్తదో తెలియని పరిస్థితి నెలకొన్నది. రైతులు పండించిన పంటలు కొనకపోవడంతో వండ్ల కుప్పల పై గుండెలు పగిలి రైతులు చనిపోతున్నారని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. సోనీయాగాందీ ఆరు గ్యారంటీలను ఇచ్చారని ప్రభుత్వంలోకి రాగానే వాటిని 100శాతం అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కర్నాటకలో పథకాలు అమలు కావడం లేదని కేటీఆర్, హరీశ్ రావులు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. కర్నాటక వెళ్లడానికి బస్సులు సిద్దంగా ఉన్నాయని వెళ్లి తెలుసుకుని రావాలని సూచించారు. ఇలాంటి వారికి జైలులో చిప్పకూడు తినబెట్టాలని ఘాటుగా విమర్శలు చేశారు.

తొమ్మిదిన్నరేళ్లు మోసాలతోనే : దామోదర్ రాజనర్సింహ

తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలన పూర్తిగా మోసాలు, దగాలతోనే కొనసాగిందని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ్మ అన్నారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్నారు. నాలుగుసార్లు పేపర్లు లీక్ కావడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో యువత, నిరుద్యోగులు దీన పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులు లేవు ఇతర పథకాల అమలు ఎక్కడ అని ప్రశ్నించారు.

ఇది దొరల తెలంగాణ : బట్టి విక్రమార్క

దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు యుద్దం అని రాహుల్ గాందీ అన్న మాటలను బట్టి విక్రమార్క గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి ఆరు గ్యారంటీలు ప్రకటించాం. మహాలక్ష్మీగా రూ.నెలకు 2500, గ్యాస్ సిలండర్ 500లకే, రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లాలన్నా మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు ఎకరానికి రూ.15 వేలు, వరిదాన్యం పండించే రైతులకు క్వింటాళులకు రూ.500 బోనస్, రూ. 12వేలు భూమిలేని పేదలకు ,ఇళ్లులేని పేదలకు ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు, ఉన్నత చదువుల కోసం విద్యార్థులు రూ.5లక్షలు,ప్రతి మండలానికి ఇంగ్లీష్ మీడియం పాఠశాల, ఇంటర్ నేషనల్ స్కూళు, ఆరోగ్యం గురించి రూ.10 లక్షలు ప్రతి పథకం తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. జగ్గారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బట్టి పిలుపునిచ్చారు.

సంగారెడ్డి సత్తా చూపించాలి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఈ ఎన్నికల్లో సంగారెడ్డి సత్తా చూపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. జగ్గారెడ్డిని ఓడించాలని మంత్రి హరీష్ రావు చాలెంజ్ చేస్తున్నారని, మరోసారి మన దమ్ము చూపించాలన్నారు. సంగారెడ్డి లో హరీష్ రావు ఎలా తిరుగుతాడో చూస్తా, తాను కష్టమొచ్చినోనికి అందుబాటులో ఉంటానని, కడుపులో పెట్టుకుంటానని జగ్గారెడ్డి చెప్పారు. తనను కూడా మీరంతా కడుపులో పెట్టుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed