కేసీఆర్ ది స్వయంకృత అపరాధం : రఘునందన్ రావు

by Aamani |
కేసీఆర్ ది స్వయంకృత అపరాధం : రఘునందన్ రావు
X

దిశ, నర్సాపూర్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది స్వయంకృత అపరాధమని ఆ పార్టీలో ఎవరు ఉండబోరని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం నర్సాపూర్ సమీపంలోని వెల్దుర్తి రోడ్ లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బిజెపి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని దాని పక్కనే రైలు నిర్మాణం చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండతో తాను ఎంపీగా ఉన్న సమయంలోనే వీటిని పూర్తి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కార్యకర్తలు పట్టించుకోకుండా పైసలు ఉన్న వారికే పదవులను కట్టబెట్టారని ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీకి అందుకనే ప్రజలు చరమగీతం పాడారని ఇప్పట్లో ఆ పార్టీ కోలుకొని స్థితిలో లేదని విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఆ పార్టీలో ఎవరు మిగిలేటట్లు కనిపించడం లేదని అన్నారు. గల్లి నుండి ఢిల్లీ దాకా సమస్యల కోసం పనిచేస్తానని సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ తనకు ఫోన్ చేయాలని లేని పక్షంలో మెసేజ్ చేసిన స్పందిస్తానని తెలిపారు. ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు తెరిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే సంగారెడ్డి, సిద్దిపేట, మాసాయిపేటలో కార్యాలయాలు తెరిచి పని చేస్తున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల లో ఫీజు తగ్గించే విషయమైనా, మోడల్ స్కూల్ అడ్మిషన్ అయినా, సీఎం రిలీఫ్ ఫండ్ విషయమైనా ఇతర ఏ విషయమైనా తాను ఉన్నా లేకున్నా కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేసిన అరాచకం వల్ల టీటీడీ దర్శనానికి ఇబ్బందులు తలెత్తయని, అక్కడ సీఎం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నందున తల్లుల్ని సమస్యల పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ ప్రాంత గిరిజనులు తనకు అండగా నిలిచారని వారికి అండగా ఎల్లప్పుడూ ఉంటానని తెలిపారు.

తాను ప్రజల విశ్వాసంతో గెలిచానని అనారోగ్యంగా ఉన్నప్పటికీ పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో కేవలం 2500 వరకు ఓట్లు వస్తే మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో 25 వేల ఎంపీ ఎన్నికల్లో 52 వేల ఓట్లు సాధించినట్లు తెలిపారు. అత్యధిక మెజారిటీ ఇచ్చిన ఈ ప్రాంత వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశ్వాసంతో పని చేస్తే గెలుపు సాధ్యమవుతుందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విశ్వాసంతో ఉత్సాహంతో పని చేయాలని మీకు అండగా ఉంటానని తెలిపారు. గత 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో కష్టపడి పనిచేసి తాను ఈ స్థితికి వచ్చానని తెలిపారు. అనంతరం బిజెపి నాయకులు కార్యకర్తలు ఎంపీ రఘునందన్ రావు ని పూలమాల శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్, రఘువీరా రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, సీనియర్ నాయకులు గోడ రాజేందర్, రమేష్ గౌడ్, బుచ్చేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, చిన్న రమేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్,రమేష్ యాదవ్, యాదగిరి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed