కేతకిలో కర్ణాటక మంత్రి ప్రత్యేక పూజలు

by Shiva |
కేతకిలో కర్ణాటక మంత్రి ప్రత్యేక పూజలు
X

దిశ, ఝరాసంగం : జిల్లాలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో శనివారం కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ కాండ్రే కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

వారు నేరుగా స్వామి వారి అమృత పుష్కరిణిలో జల లింగానికి పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడిలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన మహా మంగళ హారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు వైదిక మంత్రాలతో మంత్రిని మంత్రి కుటుంబ సభ్యులను పూలమాల శాలువాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆలయ చైర్మన్ నీలా వెంకటేశం, కార్యనిర్వహణాధికారి శశిధర్, టీపీసీసీ నాయకులు వై.నరోతం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్. పాలకమండలి సభ్యులు ఉన్నారు.

Advertisement

Next Story