నియంతృత్వ పాలన కోసమే జమిలీ జపం

by Naresh |   ( Updated:2023-09-11 16:08:48.0  )
నియంతృత్వ పాలన కోసమే జమిలీ జపం
X

దిశ , సంగారెడ్డి : ఒకేసారి ఎన్నికలంటే అధ్యక్ష తరహా పాలన తీసుకురావడమేనని, స్థానిక సంస్థలు, రాష్ట్రాల అధికారాలను హరించి ఒకే వ్యక్తి నియంతృత్వ పాలన సాగించడం కోసమే మోడీ జమిలీ జపం చేస్తున్నాడని సీపీఐఎం పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం సీపీఐఎం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో జమిలీ ఎన్నికలైనా, సాధరణ ఎన్నికకైనా సీపీఐఎం సిద్ధంగా ఉందని, ప్రజల పక్షాన పోరాటాలు ఆగవన్నారు. దేశంలో ప్రతిపక్షాలు ఐక్యమవుతుండడంతో మోడీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతామని నిజాన్ని గమనించే జమిలీ ఎన్నికలకు మోడీ ప్రయత్నిస్తున్నాడన్నారు. దేశం సాధించిన గొప్పదనమంతా తమ వల్లే జరిగినట్లుగా మోడీ తనకు తానే ప్రచారం చేసుకుంటున్నాడని పేర్కొన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న చరిత్ర బీజేపీకీ కానీ..! దాని మాతృ సంస్థలైన జనసంఘ్, ఆర్ఎస్ఎస్‌కు కానీ లేదన్నారు. ఆనాడు దేశంలో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంటే స్వదేశీ నినాదం పేరిట అడ్డుకుని జమీందార్లకు అనుకూలంగా వ్యవహారించిన చరిత్ర సంఘ్ పరివార్ దన్నారు.

ఆనాడే కాదు ప్రస్తుతం కూడా బీజేపీ కార్పొరేట్ల పక్షమే వహిస్తుందన్నారు. ఇండియా, భారత్ రెండు పదాలు కూడా రాజ్యాంగంలో ఉన్నాయని ఇప్పుడు భారత్ పేరు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని మరుగునపర్చేందుకే దేశం పేరు మార్పు, సనాతన ధర్మం చుట్టు చర్చ జరిగేలా చేస్తున్నారన్నారు. సనాతన ధర్మానికి, హిందు మతానికి సంబంధం ఉందని భావించే సంఘ్ పరివార్ ఈ దేశంలో కుల వ్యవస్థను కొనసాగించాలని చెప్పగలదా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని కాపాడడమంటే కుల వ్యవస్థను కొనసాగించడమే అవుతుందన్నారు. కులాన్ని సంహారించాలని బీఆర్ అంబేద్కర్ చెప్పాడన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హిందు మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందని, జీ-20 దేశాల సమావేశాలు ఆయా దేశాల్లో రొటీన్ గా జరిగే ప్రక్రియ తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. దేశ ప్రజలకు సంబంధించిన అధిక ధరలు, నిరుద్యోగం, రైతులకు మద్ధతు ధర, రాజ్యాంగ పరిరక్షణ, మహిళా రిజర్వేషన్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై పోరాటాలు సాగించాలని ప్రజలను కోరారు. వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు నిజాం నవాబును తరిమికొట్టిన స్పూర్తితో దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీని సైతం గద్దె దించేందుకు పోరాడాలని పిలుపు నిచ్చారు.

నిజాం లొంగిపోయేలా పోరాడిన కమ్యూనిస్టుల త్యాగాలను గుర్తించకుండా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీలు తామేదో చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నాయన్నారు. నిజాం పాలనలో భూములన్నీ జాగీర్దార్లు, జమీందార్ల చేతుల్లో ఉండేవని, వారికి వ్యతిరేకంగా భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటం సాగించి లక్షలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేశారని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బీరం మల్లేశం, కె. రాజయ్య, అతిమేల మాణిక్యం, జిల్లా కమిటీ సభ్యులు యాదవరెడ్డి, నర్సింహులు, ప్రవీణ్ కుమార్, ఎం. యాదగిరి, జిల్లా నాయకులు బాగారెడ్డి, రాజయ్య, అశోక్, పాండురంగారెడ్డి, పి. కృష్ణ, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed