బరితెగింపు అక్రమార్కులు

by Javid Pasha |   ( Updated:2023-04-02 02:29:33.0  )
బరితెగింపు అక్రమార్కులు
X

దిశ బ్యూరో, సంగారెడ్డి/హత్నూర: హత్నూర మండలంలో ప్రభుత్వ పాలన గాడితప్పుతున్నది. అధికారులను రియల్టర్లు, అక్రమార్కులు, ప్రజాప్రతినిధులు ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఫాం ల్యాండ్ పేరుతో అక్రమార్కులు అక్రమంగా అసైన్డ్ భూముల్లోంచి వేసిన రోడ్డును రెవెన్యూ అధికారులు దగ్గరుండి తొలగించారు. అధికారుల స్పందనకు స్థానికులు మెచ్చుకున్నారు. అయితే ఈ సంతోషం ఒక్కరోజు కూడా లేకుండా పోయింది. అధికారులు దగ్గరుండి తొలగించిన కట్టుకాలువల్లోని మట్టిన అక్రమార్కులు రాత్రికి రాత్రే మళ్లీ పూడ్చివేయడం గమనార్హం. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశం అవుతున్నది. అధికారులు కాలువల్లో మట్టి తొలగించగా రియల్టర్లు తిరిగి మట్టి పోసి రోడ్డు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం..

అక్రమదందా ఇలా మొదలు

హత్నూర మండలం ముచ్చర్ల గ్రామ శివారులో ఓ బడా సంస్థ పేరు చెప్పుకుని స్థానిక లీడర్లు, రియల్టర్లు అక్రమ దందాకు తెరలేపారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఫాం ల్యాండ్ డెవలప్ చేస్తున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. 50 ఎకరాలు కొనుగోలు చేసి ఈ భూమి పక్కనే ఉన్న అటవీ భూమిని కూడా కొంత అక్రమించుకున్నారు. అసలు ఈ భూమి వద్దకు వెళ్లడానికి సరైన తోవకూడా లేదు. దీనితో రియల్టర్లు కొత్త తోవ ఎంచుకున్నారు. వీరు కొనుగోలు చేసిన వరకు ఉన్న అసైన్డ్ భూముల్లోంచి రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం చేసుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి ఎంతో కొంత ముట్టజెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులను ముందుగానే సంప్రదించి తమ అక్రమాల వైపు ఎవరు రాకుండా చూసుకునే ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

దిశ కథనంలో మట్టి తొలగింపు

అసైన్డ్ భూములోంచి రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు అక్కడ ఉన్న భారీ వృక్షాలను కూడా సదరు అక్రమార్కులు తొలగించారు. బారీ ప్రొక్లైనర్లు ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే రోడ్డు వేసుకున్న తీరును ‘దిశ’ వెలుగులోకి తీసుకువచ్చింది. గ్రామ చెరువులోకి నీరు వెళ్లే కట్టుకాలువలను కూడా పూర్తిగా తొలగించినట్లు వచ్చిన వార్తలతో జిల్లా కలెక్టర్ కూడా తీవ్రంగా స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాలతో అక్రమార్కులు అసైన్డ్ భూముల్లోంచి వేసిన రోడ్డును రెవెన్యూ అధికారులు దగ్గరుండి తొలగించారు. అధికారులు స్పందించి కాలువల్లో పూడ్చిన మట్టిని తొలగించారని కూడా ‘దిశ’లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అక్రమార్కులు ఆటలు కట్టించారని ముచ్చర్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

బరితెగించి.. పూడ్చిన మట్టిని మళ్లీ తొలగించారు

చెరువులోకి వెళ్లే కట్టు కాలువలు, అలాగే అసైన్డ్ భూముల్లోంచి వేసిన రోడ్డును అధికారులు దగ్గరుండి తొలగించగా రెండు రోజులు పాటు మౌనంగా ఉండిపోయిన అక్రమార్కులు ఆ తరువాత మట్టిన తొలగించారు. తహసీల్దార్, ఇతర అధికారులు దగ్గరుండి పూడ్చివేసిన రోడ్డును అక్రమార్కులు తిరిగి ఎలా తొలగిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అక్రమార్కులు కూడా తిరిగి జేసీబీ యంత్రాలు పెట్టి రాత్రికి రాత్రే పూడ్చిన మట్టిని తొలగిస్తే అధికారులు మాత్రం ఎందుకో అటు చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మొదటి సారి సీరియస్ గా చర్యలు చేపట్టిన అధికారులు రెండొ సారి రియల్టర్లు పూడ్చిన మట్టిన తొలగించినట్లు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో వత్తిడి రావడంతోనే అధికార వ్యవస్థ మొత్తం అక్రమార్కులను చూస్తు ఉండిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫాం ల్యాండ్ పేరుతో గుంటలుగా అమ్మకం

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంలో భాగంగా రియల్టర్లు ఫాం ల్యాండ్ పేరుతో ప్లాట్ల దందాలు మొదలు పెట్టారు. నాలా అనుమతి లేకుండా వ్యవసాయ భూమిగా చూపించి ప్లాట్లు దందా చేస్తున్నారు. ఫాం ల్యాండ్ అంటూ ప్రచారం చేస్తూ చేస్తుంది మాత్రం ప్లాట్లు అమ్ముతున్నారు. అసలు ఫాం ల్యాండ్ వ్యాపారమే అక్రమమని స్థానికులు మండి పడుతుండగా ఇక్కడ అక్రమార్కులు ఈ పేరుతో అసైన్డ్, అటవీ భూములను ఆక్రమించుకోవడంతో పాటు చెరువు కట్టుకాలువలను సైతం నామరూపాలు లేకుండా చేయడం గమనార్హం. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed