ఆ రెండు పథకాలు నెరవేరిస్తే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను : ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Sridhar Babu |
ఆ రెండు పథకాలు నెరవేరిస్తే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను : ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, దుబ్బాక : ఆ రెండు పథకాలు నెరవేరిస్తే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్​ విసిరారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఆదివారం చెల్లపూర్ లో జరిగిన ప్రజాగోష బీజేపీ భరోసా కార్నల్ సమావేశానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు సమక్షంలో చెల్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ దేవవ్వ, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అవినీతిని అరికట్టేందుకే ప్రజాగోష బీజేపీ భరోసా కార్నర్​ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ధరణి పేరుతో బీఆర్ఎస్ నాయకులు రైతులను మోసం చేస్తున్నారన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే నిరుపేద ప్రజలకు రూ.7 లక్షల 50 వేల వరకు ఇవ్వాలని కోరారు. ఈ రెండు పథకాలను అమలు చేస్తే రాబోయే ఎలక్షన్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. తన డిమాండ్లను మంత్రి కేటీఆర్ నిర్వహిస్తే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్, కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, పెద్ద గుండవెల్లి ఎంపీటీసీ పరిగి రవి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకోజి ప్రవీణ్, ఎల్లారెడ్డి, తిర్మల్ రెడ్డి, కనుకరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed