గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్..

by Sumithra |
గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో వినాయక నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ సాయంతో జిల్లా పరిధిలోని 2989 మండపాలకు జియో ట్యాగింగ్ చేశారు. ఏ చిన్న ఘటనకు ఆస్కారం లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, నిర్వాహకులు గణేష్ ఉత్సవ కమిటీలతో సమన్వయంతో పనిచేసే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జియో ట్యాగింగ్ చేసిన మండపాలను పోలీసులు అధికారిక యాప్ టీఎస్ కాప్ ద్వారా గస్తీ సిబ్బంది ట్యాబ్స్ మొబైల్స్ కు లింకు చేస్తున్నారు. దీంతో మండపం ఏర్పాటు నుంచి నిమ్మజ్జనం జరిగే వరకు ఆ మండపాన్ని ఏఏ పోలీసులు సందర్శించారు. ఏ సమయంలో వచ్చారు. నిర్వాహకులు ఎవరు ఉన్నారు అనేవి తేలిగ్గా గుర్తించ వచ్చు. ఫలితంగా గస్తీ పై ఉన్నతాధికారుల నిఘా ఉంటోంది. క్యూ ఆర్ కోడ్ తో కూడిన విగ్రహాన్ని నిమజ్జనంకు తీసుకువస్తున్న వాహనం పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. వినాయక ప్రతిమ ఎక్కడ ఉంది..? అక్కడి పరిస్థితులు ఏంటీ..? అనేవి తెలుసుకోవడంతో ఎక్కడా ఆలస్యం ఆటంకాలు లేకుండా నిమజ్జనం పూర్తి చేసే అవకాశం ఉంది.

మూడు రోజుల పాటు నిమజ్జనం..

వినాయక నిమజ్జనం కార్యక్రమం జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా పరిధిలో 2989 వినాయక ప్రతిమలు ఏర్పాటు చేయగా ఈనెల 15వ తేదీన 443 వినాయక ప్రతిమలు, 16 వ తేదీన 427 వినాయక ప్రతిమలు, 17 వ తేదీన 1967 వినాయక ప్రతిమలు నిమజ్జనాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేట కోమటి చెరువు, ఎర్ర చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను సీపీ అనురాధ పరిశీలించి, మున్సిపల్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులకు సూచనలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed