జర్నలిస్టుల ఇంటి స్థలాల దరఖాస్తు గడువు పొడిగింపు

by Kalyani |
జర్నలిస్టుల ఇంటి స్థలాల దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, సంగారెడ్డి : అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ ఇంటి స్థలాలను అందించడమే లక్ష్యంగా స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగించడం జరిగిందని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని దానిలో భాగంగానే దేశంలో ఎక్కడా లేనివిధంగా అర్హులైన అందరికీ తెలంగాణ రాష్ట్రంలో అక్రిడేషన్ కార్డులు వచ్చేలా పోరాటం చేసిందన్నారు. అంతే కాకుండా ప్రతి సమస్యను వెలికితీస్తూనే సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలం దక్కేందుకు పాటుపడిందన్నారు.

ఇంకా అనేక ప్రాంతాల్లో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందలేదని, ఈ కారణంగా వారి కోసం రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే ఫైజల్ ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి ఇతర పెద్దలను కూడా కలిశారని వివరించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే ఫైజల్ సూచన మేరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, అయితే ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 15 తో ఈ గడువు ముగుస్తుండగా, మరో ఐదు రోజుల పాటు పొడిగించడం జరిగిందన్నారు. తమ దరఖాస్తులను జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ తో పాటు, జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధిఖీ, రాష్ట్ర హౌసింగ్ కమిటీ సభ్యుడు అన్వర్ కు ఇవ్వాలన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు, జోగిపేట ప్రాంతాల ప్రెస్ క్లబ్ బాధ్యులకు గాని, ఆయా ప్రాంతాల రాష్ట్ర, జిల్లా నాయకులకు గాని దరఖాస్తులను అందజేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed