ప్రతిరోజూ భోజనం ఇలానే ఉండాలి : కలెక్టర్‌

by Kalyani |
ప్రతిరోజూ భోజనం ఇలానే ఉండాలి :  కలెక్టర్‌
X

దిశ, అందోల్‌: జోగిపేట మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ రోజు మాదిరిగానే ప్రతి రోజు భోజనం రుచిగా, క్వాలిటీగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ వల్లూరి క్రాంతి అన్నారు. గురువారం జోగిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆమె అకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థినీలతో కలిసి భోజనం చేసి, నాణ్యత పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలతో పాటు వంట గదిని, వంటకు ఉపయోగించుకునే సామాగ్రిని, పప్పు దినుసులు, బియ్యం, వంట నూనెలను ఆమె పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన ఆమె పాఠశాలలోని వసతులు, విద్యాబోధన విషయాలను, భోజనం నాణ్యత పై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో ఏ మాత్రం క్వాలిటీ తగ్గించినా ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.

హస్టల్‌లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం మెనూలో కొన్ని మార్పులను చేసిందన్నారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించకుండా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కళాశాల ప్రిన్సిపల్, కేర్‌ టేకర్‌ లు భోజనం వండే సమయంలో, విద్యార్థులు భోజనం చేసే టైంలో కిచెన్‌ షెడ్యూల్‌, డైనింగ్‌ హాల్‌లో ఉండాలన్నారు. వంట చేస్తున్న సందర్బంలో హేడ్‌ క్యాప్‌ను ధరించాలని, వడ్డించే సమయంలో చేతులకు గ్లౌస్‌లు వేసుకొవాలని, ఇలా అన్ని సందర్బాల్లో శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. ఆమె వెంట ఆర్‌డీవో పాండు, మండల ప్రత్యేకాధికారి గీతా, ఎంపీడీవో రాజేష్, ఎంఈవో కృష్ణ, ఇంచార్జీ ప్రిన్సిపాల్‌ సౌజన్యతో పాటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయునీలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed