సీఎంఆర్ బియ్యంలో అంతు లేని అవినీతి.. 17 మిల్లులకు ఆర్‌ఆర్ యాక్ట్ నోటీసులు!

by Anjali |
సీఎంఆర్ బియ్యంలో అంతు లేని అవినీతి.. 17 మిల్లులకు ఆర్‌ఆర్ యాక్ట్ నోటీసులు!
X

దిశ, మెదక్ ప్రతినిధి: సర్కారు సొమ్ము రైస్ మిల్లర్లకు కోట్ల వర్షం కురిపిస్తుంది. కాస్త రాజకీయ పలుకుబడి ఉంటే చాలు కోట్లు మింగేసే స్కీమ్ సివిల్ సప్లై శాఖ కల్పించింది. రైతులు పండించిన ధాన్యం మిల్లింగ్ చేయాల్సిన రైస్ మిల్లు యాజమాన్యం అవినీతి పుంతలు తొక్కి.. ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు 90 కోట్ల అవినీతికి పాల్పడినా ఆ శాఖ ఇన్నాళ్లు నిద్రలో కొనసాగింది. ఇప్పుడు నిద్ర లేచి క్రిమినల్ కేసులు, ఆర్ ఆర్ యాక్ట్ నోటీసులు ఇచ్చి రికవరీ ప్రయత్నం చేస్తున్నా సర్కారు సొమ్ము కోట్లు మింగేశారు.

మింగిన కోట్లు ప్రభుత్వం కక్కిస్తుందా..

మెదక్ జిల్లాలో అత్యధికంగా వరి సాగవుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం వచ్చే జిల్లాలో మెదక్ ఒక్కటి. ఇందుకు అనుగుణంగానే జిల్లాలో సుమారు 160 వరకు రైస్ మిల్లులు ఉన్నాయి. ప్రతి సాగు సీజన్ లో ప్రభుత్వ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం సివిల్ సప్లై శాఖ నిర్దేశించిన విధంగా ధాన్యం కేటాయిస్తారు. ప్రతి సీజన్ లో 2.50 లక్షల నుంచి 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించి కస్టమ్స్ మిల్లింగ్ కోసం ఇస్తారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)కు ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఇచ్చిన 433 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 290 క్వింటాళ్లు అంటే 67 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో అరు నెలల వ్యవధిలో 30 శాతం బియ్యం, ఏడాది లోపు మిగితా బియ్యం సీఎంఆర్ మార్చి ఇవ్వాల్సిన బాధ్యత మిలర్లదే. గడువులోగా సాధ్యం కానీ పక్షంలో అధికారుల వద్ద గడువు తీసుకొని నిర్ణీత సమయంలోగా బియ్యం అప్పగించాలి. అలా కాని పక్షంలో సమయానికి సీఎంఆర్ ఇవ్వని మిల్లర్ యాజమాన్యానికి 25 శాతం జరిమానా విధిస్తుంది. గడువు పెరిగినా కొద్దీ జరిమానా కూడా పెరుగుతుంది. ఇలా పూర్తి స్థాయిలో బియ్యం వచ్చే వరకు మిల్లర్లపై జరిమానా విధించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

మిల్లులకు వెళ్లుడే తప్ప వచ్చుడు అంతంతే...?

జిల్లాలో మిల్లర్ల తీరుపై విమర్శలు వస్తున్నా కొన్నేళ్లుగా అధికారులు మౌన పాత్ర వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మిల్లులో సీఎంఆర్ గుట్టలుగా పేరుకుపోయినా చర్యలు తీసుకోకపోవడంతో పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2022- 23 ఖరీఫ్ సీజన్ లో జిల్లాలో 3,86,065 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన బియ్యం 2,59,474 మెట్రిక్ టన్నులు. కానీ సివిల్ సప్లై శాఖ కు వచ్చింది 2,38,347 మెట్రిక్ టన్నులు. ఇంకా రావాల్సింది 21,127 మెట్రిక్ టన్నులు. 2022-23 రబీ సీజన్ లో 2,99,848 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపిణీ చేయగా అందులో 2,01,904 బియ్యం ఇవ్వాల్సి ఉండగా 63,697 మెట్రిక్ టన్నుల సీంఎంఆర్ కు వచ్చింది ఇంకా 1,38,207 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల నుంచి రావాల్సి ఉంది.

2023-24 ఖరీఫ్ సీజన్ లో 2,68,777 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు పంపగా అందులో 1,80,360 బియ్యం కస్టమ్స్ మిల్లింగ్ కు రావాల్సి ఉంది. కానీ అందులో 99,343 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా 81,018 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్ లో ఉంది. 2023- 24 రబీ సీజన్ లో 2,52,013 మెట్రిక్ టన్నుల ధాన్యంకు 1,70,777 బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 26,330 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయి. ఇంకా 1,48, 723 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది.

మిల్లర్లు మింగింది కోట్లు..!

జిల్లాల్లో బియ్యం అవినీతి ఊహకు అందని విధానంగా గత కొన్ని సీజన్ లలో జరిగింది. కోట్లలో జరిగిన అవినీతి తిరిగి రాబట్టేందుకు జిల్లా యంత్రాంగం ఆలస్యంగా తేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం భారీగానే జరిగింది. పదుల కోట్లలో రావాల్సి ఉన్నా డబ్బుల కోసం క్రిమినల్, ఆర్ ఆర్ యాక్ట్ కింద రాబట్టే ప్రయత్నం చేస్తున్నా అంతగా ఫలితాలు ఇవ్వడం లేదు. జిల్లాలో 2022-23 ఖరీఫ్ సీజన్ లో రూ. 83,85,92118 కోట్లు రావాల్సి అండగా అందులో 8 మంది రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు, ఆర్ఆర్ యాక్ట్ కింద రూ. 14,75,95,300 కోట్లు రికవరీ చేశారు. ఇంకా రూ.69,099,6818 కోట్లు మిల్లర్ల వద్ద పెండింగ్ లోనే ఉంది. ఆర్ఆర్ యాక్ట్ కింద 17 రైస్ మిల్ యాజమాన్యాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇందులో రూ.16,26,92868 కోట్లు రావాల్సి ఉంటే కేవలం 3,86,50,000 మాత్రమే రికవరీ అయ్యాయి. ఇంకా రూ 12, 4,042,868 కోట్లు రికవరీ కావాల్సి ఉంది. 2023-24 సీజన్ లో రూ 5,01,82,388 కోట్లు రావల్సి ఉంటే ఒక్క రూపాయి కూడా రికవరీ కాలేదు. 2021-22 సీజన్ లో రూ.32,76,15311 కోసం నాలుగు మిల్లులకు ఆర్ ఆర్ యాక్ట్ నోటీసులు ఇవ్వగా ఇందులో రూ 8,60,34461 కోట్లు రికవరీ అయ్యాయి.

ఇంకా 7,77,94435 కోట్లు బకాయి ఉంది. జిల్లాలో కేవలం మూడు సీజన్ల బియ్యం బకాయిలు రూ 94,301,6504 కోట్లు మిల్లర్ల వద్ద బాకి ఉంది. ఏళ్లుగా ఉదాసీనంగా ఉండి చేతులు కాలాక అన్నట్టుగా రికవరీ చర్యలు చేపట్టినా జరగాల్సిన నష్టం భారీగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. గత పాలకుల మద్దతుతో అర్హత లేకున్నా మిల్లులకు ధాన్యం సరఫరా చేసి అవినీతికి అధికారులే బాటలు వేశారన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది మిల్లర్ల వద్ద కోట్ల బకాయిలు ఉన్నా ఇన్నాళ్లు ఎందుకు జిల్లా అధికారులు మౌనం వహించారో అర్థం కాని ప్రశ్న. మిల్లుల్లో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎప్పుడో ఇతర జిల్లాల్లో విక్రయాలు చేపట్టడం వల్లనే సీఎంఆర్ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పని చేసిన జిల్లా కలెక్టర్ రికవరీ కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా ఫలితం ఇవ్వలేదు. కనీసం ప్రస్తుతం కలెక్టర్ అయినా ధాన్యంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటే కొంత మేరకైనా అరికట్టే అవకాశం ఉంటుంది.

రికవరీ చేస్తున్నాం..

హరి కృష్ణ, సివిల్ సప్లై డీఎం, మెదక్

జిల్లాలో పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ రికవరీ చేస్తున్నాం. గత సీజన్ కు సంబంధించి 57 శాతం వచ్చింది. గతంలో పెండింగ్ ఉన్న మిల్లుల వద్ద కూడా రికవరీ చేస్తున్నాం. ఇప్పటికే 8 మిల్లుల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు, 17 మిల్లులపై ఆర్ ఆర్ యాక్ట్ పై నోటీసులు ఇచ్చాం. ఇంకా రికవరీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో ఎవరిని విడిచిపెట్టడం లేదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed