రేపు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు

by Naresh |   ( Updated:2023-10-30 16:24:25.0  )
రేపు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు  పిలుపు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి, దుబ్బాక, దౌల్తాబాద్: దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారం లో భాగంగా దుబ్బాక నియోజక వర్గం పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆంజనేయులు తల్లి మరణించడంతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. తిరిగి వెళ్లుతున్న క్రమంలో మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గట్టని. రాజు సెల్పీ దిగుతానని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వచ్చి వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. దీంతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పొట్ట భాగంలో గాయం అయింది.

ఊహించని పరిణామంతో కంగుతిన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డిని కారులో హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. కత్తితో ఎంపీ పై దాడికి పాల్పడిన వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ శ్వేత, ఏసీపీ సురేందర్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. ఇదిలా ఉంటే నిందితుడు గట్టని. రాజు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. రెండు ఫేస్ బుక్ అకౌంట్లను నిందితుడు వాడుతున్నాడు. ఫేస్‌బుక్ లో పలువురు రాజకీయ నేతలతో దిగిన ఫోటోలను రాజు అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్లో రాజు పనిచేస్తున్నాడు. ఘటన అనంతరం కార్యకర్తల దాడిలో రాజు సైతం తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.

నిందితుడి అరెస్టు : పోలీస్ కమిషనర్ శ్వేత : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన నిందితుడు రాజుని అరెస్టు చేసి కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినట్లు పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. దాడికి గల ఉద్దేశ్యానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ప్రాథమికంగా తెలియలేదని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రచారం, ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టుల పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దాడికి నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తల రాస్తారోకో..

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు దుబ్బాక నియోజక వర్గ పరిధిలోని దుబ్బాక మండలం భూంపల్లి చౌరస్తా, తొగుట, దుబ్బాక, దౌల్తాబాద్, చేగుంట, రాయపోల్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దాడికి ఎమ్మెల్యే రఘునందన్ రావు కారణమని ఆరోపిస్తూ దుబ్బాక పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మ దహనం చేశారు.

రేపు దుబ్బాక నియోజక వర్గం బంద్ కు పిలుపు

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడికి నిరసనగా దుబ్బాక నియోజక వర్గం బంద్ కు బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గన్నె వనిత భూంరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీ రాజలింగం గౌడ్, జీడిపల్లి రాంరెడ్డి, ఆశ యాదగిరి మాట్లాడుతూ... ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండించారు.

Advertisement

Next Story