మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Shiva |
మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
X

దిశ, పటాన్ చెరు: ప్రతి మనిషికి సురక్షితమైన మంచి నీరు అందించాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథతో నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాట అవుతున్న కాలనీలకు రక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇంద్రేశం గ్రామ పరిధిలోని పీఎన్ఆర్ కాలనీలో రూ.88 లక్షలతో, రామేశ్వరం బండ గ్రామ పరిధిలోని జీహెచ్ఎంసీ కాలనీలో రూ.43 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమన మాట్లాడుతూ ప్రజలు రక్షిత మంచినీరు పొందడం ప్రాథమిక హక్కు అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం మిషన్ భగీరథ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. పట్టణం నుంచి పల్లె వరకు ప్రతి ఇంటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఇప్పటికే మిషన్ భగీరథ మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.

వారి స్ఫూర్తితో నియోజకవర్గంలో రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యే జీఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు ధరణి అంతిరెడ్డి, నర్సింహులు, ఎంపీటీసీ మాణెమ్మ, సీనియర్ నాయకులు అంతిరెడ్డి, రామచంద్రారెడ్డి, బండి శంకర్, గ్రామీణ నీటిపారుల శాఖ డీఈ శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed