సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది : హరీష్ రావు

by Kalyani |
సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది : హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అని ప్రగల్భాలు పలికాడని గుర్తు చేశారు. కేసీఆర్ ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్‌ట్రా పని చేయాలని మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్ లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా? అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్ళు ఆ సంగతి గుర్తు చేయాలని ఎద్దేవ చేశారు. మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేసి... మూడు కోట్ల మంది దేవుళ్లపై ఒట్టు పెట్టి వాళ్ళను కూడా మోసం చేశాడని అన్నారు. బాండ్ పేపర్ల మీద రాసి హామీల అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.

రైతులకు రూ.15వేల రైతు భరోసా రూ.4వేల ఆసరా పెన్షన్ మహిళలకు రూ. 2500 ఇస్తానని అన్ని వర్గాలను మోసం మోసం చేశాడని మండిపడ్డారు. “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అవుతున్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేయడం లేదు అన్నారు. వరంగల్ ఏకశిలా పార్కు ముందు ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు సెప్టెంబర్ 13 నాడు హామీ ఇచ్చావు కదా..? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానన్నావు కదా..? నువ్వు చెప్పిన మాటలే ఎందుకు మర్చిపోయావు ? నువ్వు ఇచ్చిన మాటను గుర్తు చేసేందుకు ఇంద్ర పార్క్ వద్ద ధర్నా చేస్తే అరెస్టు చేశావు. అసెంబ్లీ ముట్టడి చేస్తే అరెస్టు చేసి మహిళల అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో పెట్టావని” మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఘనంగా చెప్తావు నువ్వు ఇచ్చిన హామీ నీకు గుర్తు చేస్తే అరెస్టు చేస్తావు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు.

నీ ఏడాది పాలనలో నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని అంటే కేసు పెట్టినట్లు గుర్తు చేశారు. విద్యార్థులకు పెట్టే అన్నం మెస్ బిల్లులను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15% విద్యకు బడ్జెట్ పెడతామని 7.4శాతం బడ్జెట్ పెట్టారని అన్నారు. 2500 స్కూళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూతపడ్డాయని తెలిపారు. 25వేల మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని, విద్యా వలంటీర్లను పూర్తిగా తొలగించారని అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజలను ముంచి విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఒక గంట కాదు నాలుగు గంటలు ఎక్స్‌ట్రా పని చేద్దాం ఈ ముఖ్యమంత్రి మెడలు వంచుదాం..సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడిద్దాం అని పిలుపు నిచ్చారు. ఈనెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed