సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు..బీఆర్ ఎస్ పార్టీ భయపడదు : హరీష్ రావు

by Kalyani |
సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు..బీఆర్ ఎస్ పార్టీ భయపడదు : హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు చురకలు అంటించారు. ప్రజలను ప్రేమ పొందే స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి లేడని, పోలీసులను పంపించి బెదిరించి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నాడన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు బీ ఆర్ ఎస్ పార్టీ భయపడేది లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 237 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మాజీ సీఎం కేసీఆర్ ను మరిచిపోయేలా ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.

దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన కేసీఆర్ ను ప్రజలు మరిచిపోరని.. భూమి ఉన్నంత కాలం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టిన యాదాద్రి లో పుట్టిన రోజు జరుపుకున్నట్లు తెలిపారు. మూసీ సుందరీకరణ కోసం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి మంచి నీళ్లు తరలించాలని చూస్తున్న ట్లు పేర్కొన్నారు. కేసీఆర్ లేక పోతే తెలంగాణ వచ్చేదా..? రేవంత్ రెడ్డి సీఎం అయ్యే వాడేనా అన్నారు. 11 నెల కాంగ్రెస్ పాలనలో ఒక్క ఇళ్లు కట్ట లేదని.. సీఎం రేవంత్ రెడ్డికి కూలగొట్టడం తప్ప కట్టే విధానం కాదని ఏద్దెవా చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాట్లు పడక ముందే రైతు బంధు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేది.. నేడు పంట చేతికి వచ్చినా రైతు బంధు రాలేదన్నారు. బతుకమ్మ పండగకు రెండు చీరలు ఇస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఒక్క చీర సైతం పంపిణీ చేయలేదన్నారు. అవ్వ తాతలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తానని ఉన్న రూ.2 వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసినందుకు మోసం చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 15 రోజుల్లో 4 గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు పై ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకునే హాస్టల్ విద్యార్థులకు కనీసం కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందని అన్నారు.

Advertisement

Next Story