ఓడిపోయి ప్రశాంతంగా ఉన్నా

by Sridhar Babu |
ఓడిపోయి ప్రశాంతంగా ఉన్నా
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డిలో ఓడిపోయి తాను ప్రశాతంగా ఉన్నానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం జగ్గారెడ్డి, ఆయన కుమార్తె జయారెడ్డి(కూచి) పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లి నుంచి సంగారెడ్డిలోని మదీన వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సీఎస్ఐ చర్చి, నాల్సాబ్ గడ్డ లోని మదీన వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ర్యాలీలో కార్యకర్తలు జగ్గారెడ్డితో సెల్పీలకు పోటీ పడ్డారు. అదే విధంగా దారి వెంట జగ్గారెడ్డిని శాలువాలతో సన్మానించారు. అదే విధంగా ఆయన బర్త్ డే సందర్బంగా పట్టణమంతా ఫ్లెక్సీలతో నింపివేశారు. డీజే సౌండ్లతో, బాణాసంచా మోతలతో ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి ఐబీలో కేక్ కట్ చేసిన అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఓడించిన

తరువాత ప్రశాంతంగా ఉన్నానన్నారు. దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా ఓడిపోయినందుకు నాకు ఎలాంటి బాధ లేదు..సంగారెడ్డి ప్రజలు ఓడగొట్టామని ఫీల్ కావద్దు, నేను మనస్పూర్తిగా, దైవసాక్షిగా చెబుతున్నా ప్రశాంతంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ది విషయంలో జవాబుదారిగా ఉంటానన్నారు. ప్రజలకు ఏమేమి కావాలో చేసిపెడతానని హామీ ఇచ్చారు. అదే విధంగా రెండు నెలల వరకు కార్యకర్తలు హైదరాబాద్ రాకూడదని, గాందీభవన్ కు పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పోతా అన్నారు. అక్కడ ఎవ్వరిని కలవనని, అందువల్ల రావద్దని కార్యకర్తలకు సూచించారు. తాను రెండు నెలల తరువాత ప్రతి సోమవారం సంగారెడ్డిలోనే ఉంటానని, రెండు నెలల వరకు తన వద్దకు ఎవ్వరూ రావద్దన్నారు. నేను పైసలు సంపాదిస్తా..మీకు పంచిపెడతా..నా సొంత ఆస్తీ ఏమిలేదు..నా భార్యకు బంగారు నెక్టెస్ కూడా చేయించలేదన్నారు.

నేను మొత్తం అప్పుల్లోనే ఉన్నానన్నారు. దసరా పండుగకు ప్రతి సంవత్సరం రూ.2 కోట్లు ఖర్చు పెడుతున్నాం, శ్రీరామ నవమికి రూ.60 లక్షలు, అన్ని పండుగలకు కలిపి రూ.20 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కార్యకర్తలు నాయకులు నా మొఖంలో ఆనందం చూస్తున్నారు కానీ నాలోపల అగ్ని రగులుతుందన్నారు. సాయంత్రం ఆరు తరువాత తాగుడు అలవాటు ఉంటే రూములో కూర్చిని తాగి వెళ్లిపోవాలి తప్పా కార్యకర్తలు ఎవ్వరూ గడబిడ చేయోద్దన్నారు. ఇతర పార్టీల వారు మనజోలికి రారు మనము వారి జోలికి పోవద్దని సూచించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ సమస్య రావద్దని పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐడీసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్, చెర్యాల ఆంజనేయులు, జార్జీ, కూన సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed