కేసీఆర్ కు మరో షాక్!.. హస్తం గూటికి హైదరాబాద్ మేయర్?

by Prasad Jukanti |   ( Updated:2024-02-03 11:46:34.0  )
కేసీఆర్ కు మరో షాక్!.. హస్తం గూటికి హైదరాబాద్ మేయర్?
X

దిశ, సిటీ బ్యూరో/ డైనమిక్ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం సాగుతున్న వేళ గులాబీ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిమామాలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భేటీ కావడం సంచలనంగా మారింది. శనివారం ఉదయం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో సీఎంతో మేయర్ అధికారికంగా భేటీ అయ్యారు. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎంతో రేవంత్ రెడ్డితో భేటీ అవుతుండగా వీరంతా పార్టీ మారేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకున్న వేళ అనూహ్యంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీపై స్పందిస్తూ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్, జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు, రివ్యూ మీటింగ్ ల కోసమే తాను సీఎంను కలిశానని మేయర్ వివరణ ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎంతో మేయర్ భేటీ వెనుక రాజకీయ కోణమా? అభివృద్ధి కోసమా అనేది సస్పెన్స్ గా మారింది.

మేయర్ తో పాటు మాజీ మేయర్?:

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ సీనియర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కండువా మార్చబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విజయలక్ష్మి సీఎంతో సమావేశం కావడం ఊహాగానాలకు దారి తీసింది. ప్రస్తుత మేయర్ విజయలక్ష్మితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను సైతం కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయని వీరిద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం ఆసక్తిగా మారింది. వీరిద్దరు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్నారని దీంతో వీరిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా గులాబీ పార్టీని దెబ్బతీయవచ్చనే వ్యూహంతో హస్తం నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రౌండ్ వర్క్ ప్రిపేర్:

విజయలక్ష్మి తండ్రి కె.కేశవరావు బీఆర్ఎస్ లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అయితే కేకే వారసురాలిగా రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన విజయలక్ష్మి అసెంబ్లీ లేదా పార్లమెంట్ లో అడుగుపెట్టాలనే ఆలోచనతో ఉన్నారని ఈ మేరకు ఆమె లోక్ సభ పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ప్రస్తుతం కేకే కుటుంబ సభ్యులపై తీవ్రమైన భూఆక్రమణ ఆరోపణలు వెంటాడుతున్నాయి. దీంతో ఆమె పార్టీ మారబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయలక్ష్మితో పాటు మరో 20 నుంచి 22 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం త్వరలోనే కండువా మార్చేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. 1996 తర్వాత తెలుగు నాట ప్రభుత్వం ఏర్పడినా పదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్నది. కొత్త ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రెండు దఫాలుగా అధికారంలోనే ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో అంత కాలం ప్రతిపక్షంలోనే కొనసాగితే రాజకీయంగా మరుగున పడిపోతామనే భావనతో విజయలక్ష్మితో పాటు పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు రెడీ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ హెచ్చరికలు బేఖాతర్:

ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమైన గులాబీ బాస్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దని, అభివృద్ధి పనుల విషయంలో జిల్లా మంత్రులకు ప్రజాక్షేత్రంలోనే వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు సీఎంను కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించారు. అయితే కేసీఆర్ ఈ మాటలు చెప్పి రెండు రోజులు గడవక ముందే గద్వాల్ విజయలక్ష్మి అధినేత ఆదేశాలను కాదని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఈ సందర్భంగా వీరి మధ్య ఏకాంతపు చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతున్నది. పక్కా ప్లాన్ ప్రకారమే మేయర్ సీఎంతో భేటీ అయ్యారా? త్వరలోనే ఆమె కండువా మార్చుకు ఖాయమేనా అనే చర్చ జోరందుకుంది.

Read More..

పార్టీలు మారితే గౌరవం దొరకదు..! ఈటల వ్యాఖ్యల దుమారం..

Advertisement

Next Story

Most Viewed