సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనె ధరలు

by Sathputhe Rajesh |
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనె ధరలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్టు తెలంగాణపై పడింది. రాష్ట్రంలో సన్ ఫ్లవర్ వంట నూనెకు కొరత ఏర్పడింది. డిమాండ్‌కు తగినంతగా సప్లై లేదు. నిన్నమొన్నటి వరకూ రూ. 110 పలికిన లీటర్ సన్ ఫ్లవర్ నూనె ధర ఇప్పుడు అమాంతంగా రూ. 165 దాటేసింది. ఒక్క లీటర్‌కే రూ. 50 కంటే ఎక్కువ పెరిగింది. అయినా మార్కెట్‌లోని చాలా దుకాణాల్లో దొరకడం లేదు. వంటనూనెల్లో అన్నింటికంటే ఎక్కువగా సన్ ఫ్లవర్ వాడుతున్నారని, కానీ అవసరాలకు తగినంతగా హోల్ సేల్ డీలర్ల నుంచి సప్లై అందడంలేదని చిల్లర వ్యాపారులు పేర్కొన్నారు. భారతదేశానికి దిగుమతి అవుతున్న సన్ ఫ్లవర్ నూనెల్లో దాదాపు 75% ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచే వస్తున్నది. ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో సరఫరా ఆగిపోయింది.

ఇప్పటికే దేశానికి దిగుమతి అయిన వంట నూనెల స్టాక్ హోల్ సేల్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హోల్ సేల్ వ్యాపారులు దేశవ్యాప్తంగానే ఒక సిండికేట్‌గా ఏర్పడి అక్రమంగా నిల్వ చేసి స్టాక్ లేదంటూ బుకాయిస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి. యుద్ధాన్ని సాకుగా చూపి ఎక్కువ ధరకు అమ్ముకోడానికి హోల్‌సేల్ వ్యాపారులు కుమ్మక్కయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో చాలా చిల్లర దుకాణాలకు సప్లై బంద్ అయింది. ఒక మోస్తరు డిపార్టుమెంటల్ దుకాణాల్లోనూ స్టాక్ లేదు. మార్కెట్‌లో వేరుశెనగ, రైస్ బ్రాన్, నువ్వులనూనె లాంటివి చాలా రకాలుగా ఉన్నా ఎక్కువగా సన్ ఫ్లవర్ ఆయిల్‌నే వాడుతుంటారని చిల్లర వ్యాపారులు పేర్కొన్నారు.

ఈ యుద్దం ఎన్ని వారాలు కొనసాగుతుందో స్పష్టత లేకపోవడంతో ఎన్ని ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకుంటే దిగుమతి తగ్గిపోయిన తర్వాత ధర ఎక్కువ వస్తుందనేది హోల్ సేల్ వ్యాపారుల ఆలోచన. హైదరాబాద్ మార్కెట్‌లో సన్ ఫ్లవర్ ఆయిల్‌కు ఏర్పడిన కొరతతో అనివార్యంగా ఇతర నూనెలు కొనక తప్పడం లేదని వినియోగదారులు వ్యాఖ్యానించారు. త్వరలో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వంటనూనెల ధరలు మరింతగా పెరిగే చాన్స్ ఉన్నది. దాదాపుగా వారం రోజుల నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడిందని, మరికొంతకాలం ఇది కొనసాగనున్నట్లు చిల్లర వ్యాపారులు పేర్కొన్నారు.

"హైదరాబాద్ మార్కెట్‌లో సన్ ఫ్లవర్ ఆయిల్‌కు డిమాండ్ ఎక్కువైంది. సేల్స్ ఎప్పటి లాగానే ఉన్నా సప్లై తగ్గిపోవడంతో డిమాండ్ ఏర్పడింది. హోల్ సేల్ సప్లై బాగా తగ్గిపోయింది. వారం క్రితం వరకూ రూ. 110-115 మధ్య లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ ధర ఉండేది. ఇప్పుడు అది రూ. 165 దాకా చేరుకుంది. కొంత మొత్తంలోనే వస్తున్నా కొత్త స్టాక్ ప్యాకెట్లపై ధరలు కూడా కొత్తవే వస్తున్నాయి. మనకు వచ్చే సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా ఉక్రెయిన్ నుంచే వస్తుంది. పామాయిల్ ఇండోనేషియా నుంచి వస్తుంది. యుద్ధం వారం రోజుల నుంచి జరుగుతున్నది. ఇప్పుడు అక్కడి నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. కానీ హోల్‌సేల్ వ్యాపారుల దగ్గర చాలా స్టాక్ ఉంటుంది. కానీ చిల్లర దుకాణాలకు మాత్రం అవసరమైనంత స్థాయిలో సప్లై కావడంలేదు" అని హైదరాబాద్ చిల్లర వ్యాపారుల సంఘం నాయకుడు దిలీప్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story