దళితులకు రూ.10 లక్షలు.. బీసీలకు లక్షేనా?

by GSrikanth |   ( Updated:2023-05-20 12:19:07.0  )
దళితులకు రూ.10 లక్షలు.. బీసీలకు లక్షేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ కొత్త పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. బీసీలను బీఆర్ఎస్ వైపు తిప్పుకొనేందుకు చేతివృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ స్కీమ్‌పై అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. దళితులకు 10 లక్షల ఆర్థిక సాయం చేసి.. బీసీలకు మాత్రం లక్ష రూపాయలు మాత్రమే ఇవ్వడమేమిటని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. పలు బీసీ సంఘాలు ఎన్నికల స్టంట్‌గా అభివర్ణిస్తున్నాయి. బీసీలు రూ. లక్షతో సంతృప్తి చెందుతారా? అనే దానిపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.

బీసీ నేతల ఆందోళన

బీఆర్ఎస్ సర్కారు బీసీ బంధు తీసుకొస్తుందేమోనని బీసీ నేతలు భావించారు. ఈ పథకం అమలైతే రాష్ట్రంలో తమకు తిరుగుండదని భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులు చేసుకుంటున్న మాత్రమే ఆర్థిక సాయం ప్రకటించడంతో వారిలో అయోమయం నెలకొన్నది. చేతివృత్తుల సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని వేసింది. విధివిధానాలు ఖరారై లబ్దిదారుల ఎంపిక జరిగితే జూన్ 2న ఆర్థికసాయం అందించాలని చేస్తున్నారు.

సాయం ఎంతమందికి?

జనాభాలో 50 శాతానికిపైగా బీసీలు ఉన్నారు. కొత్త స్కీమ్‌కు నియోజకవర్గానికి ఎంతమంది లబ్దిదారులను ఎంపిక చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అర్హులను ఎలా ఎంపిక చేస్తారు? ఇప్పటికే బీసీల్లోని చేతి వృత్తులకే ఇస్తారా? ఇతర కులాల వారికి ఇవ్వకపోతే పరిస్థితి ఏంటీ? ఎన్నికల సమయంలో ఆధరిస్తారా? లేదా? అనే ఆందోళన మొదలైంది. దళితబంధు కింద పదిలక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. బీసీబంధును ఎన్నికల సమయంలో పథకానికి శ్రీకారం చుడతారని బీసీవర్గాలతోపాటు నేతలు సైతం భావించారు. అనూహ్యంగా బీసీలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా నేతలు ఢిఫెన్స్ లో పడినట్లయింది. బీసీ బంధుతో 10లక్షలు ఇస్తారని భావించినవారికి నిరాశే ఎదురైంది. ప్రభుత్వం కులవృత్తులు చేస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకునేందుకు రూ.లక్ష వరకు ఆర్థికసాయం అందించాలని నిర్ణయించడంతో ఇతర కులాలకు ఏం సాయం చేస్తారు? ఎంత సాయం చేస్తారు? ఎలా ఎంపిక చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పథకంపై బీసీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అంటూ మండిపడుతున్నారు. బీసీబంధును అమలు చేసి రూ.10లక్షల ఆర్థికసాయం అందజేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దళితులకు పదిలక్షలు... బీసీలకు లక్షా... ఇదేం వివక్ష అంటూ బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రెస్పాన్స్‌పై ప్రభుత్వం ఆరా..

బీసీలకు లక్ష ఆర్థికసాయం చేస్తామని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందనే వివరాలను తెలుసుకుంటుంది. బీసీ వర్గాల నుంచి సానుకూలంగా స్పందన వస్తుందా అనే వివరాలను సేకరిస్తుంది. దానితో పాటు బీసీ నేతల అభిప్రాయంపై కూడా తెలుసుకుంటున్నట్లు సమాచారం. చేతవృత్తులవారికే సాయం చేస్తామని ప్రకటించడంతో మిగిలిన బీసీల్లోని కులాలు ఎలా రెస్సాన్స్ వస్తుందని ప్రభుత్వ సంస్థల నుంచి తెలుసుకుంటుంది.

Also Read..

BRS సర్కార్ అవినీతిని త్వరలో ఆధారాలతో బయటపెడుతా.. : RSP

Advertisement

Next Story

Most Viewed