ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డి.. ప్రకటించిన మంత్రి జూపల్లి

by GSrikanth |
ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డి.. ప్రకటించిన మంత్రి జూపల్లి
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మన్నే జీవన్ రెడ్డిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రకటించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మన్నే జీవన్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉంటారు అని, ఆయన గెలుపు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్న తలంపుతో ఉండి పార్టీ నిర్ణయంతో తన ఆలోచనను విరమించుకున్న నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, తదితరులకు త్వరలోనే నామినేటెడ్ పదవులు దక్కుతాయని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీహరి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్, అనిరుద్ రెడ్డి, పర్ణిక రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, నరేంద్ర పేట జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా నేత తిరుపతయ్య తదితరులు మాట్లాడారు. ఈనెల ఆరో తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాలమూరు-న్యాయ యాత్ర ముగింపు, పార్లమెంటు ఎన్నికల ప్రచార శంఖారావ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు అవుతున్న నేపథ్యంలో సభను దిగ్విజయవంతం చేయాలని కార్యక్రమానికి హాజరైన నేతలు నిర్ణయించారు.

Advertisement

Next Story