వర్గీకరణ జరిగే వరకు పరీక్షలు, ఫలితాలు నిలిపివేయాల్సిందే: సీఎంకు మందకృష్ణ మరో లేఖ

by Ramesh N |
వర్గీకరణ జరిగే వరకు పరీక్షలు, ఫలితాలు నిలిపివేయాల్సిందే: సీఎంకు మందకృష్ణ మరో లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ (SC classification) అంశంపై శనివారం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) మరోసారి బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష ఫలితాలు నిలిపివేయండని లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని, ఆగస్టు 1న సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అదే రోజు నిండు శాసనసభలో స్వాగతించారని గుర్తుకు చేశారు. అందరికంటే ముందుగా దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటన చేశారని, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని స్పష్టమైన ప్రకటన అసెంబ్లీలో చేశారని అన్నారు.

కానీ, ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అందులో చట్టం చేస్తామని హామీ ఇచ్చారు.. మళ్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ పత్రిక ప్రకటన చేయించిన తర్వాత మా జాతి ప్రజలు మరోసారి మోసానికి గురవుతున్నారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే మేము మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇంతకు ముందు 11 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయడం వలన మేము ఎన్ని పోస్టులు నష్టపోయామో మీకు తెలుసు.. అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఫలితం రాబోతుందనుకునే సమయంలో, వర్గీకరణ లేకుండా ఉద్యోగ పోటీ పరీక్షల ఫలితాలు ప్రకటనలు జరిగితే, మాదిగలే కాదు, ఇతర కులాలు కూడా సహించవు.. దయచేసి ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని పోటీ పరీక్షలను నిలిపివేయండని లేఖలో తెలిపారు.

Next Story