R Krishnaiah: రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం.. ఆర్.కృష్ణయ్య ఇంటికి వెళ్లిన మల్లు రవి

by Shiva |
R Krishnaiah: రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం.. ఆర్.కృష్ణయ్య ఇంటికి వెళ్లిన మల్లు రవి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీసీ సంఘం నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah)తో నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి (Mallu Ravi) భేటీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన స్వయంగా విద్యానగర్‌లోని కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. అనంతరం కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరాలంటూ కృష్ణయ్యను మల్లు రవి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పార్టీలో చేరితే సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. అందుకు స్పందించిన కృష్ణయ్య ఆలోచించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది.

కాగా, 2022లో రాజ్యసభ సభ్యుడిగా వైసీపీ పార్టీ తరుఫున ఎన్నికైన ఆర్ కృష్ణయ్య ఎవరూ ఊహించని విధంగా ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు పంపగా.. ఆయన కూడా రాజీనామాను ఆమోదించారు. దీంతో ఏపీ నుంచి ఓ రాజ్యసభ సీటు ఖాళీ అయినట్లుగా రాజ్యసభ నుంచి తాజాగా బులిటెన్ విడుదలైంది. మరోవైపు ఆయన కొత్తగా ఓ పార్టీ పెట్టబోతున్నారని, బీజేపీలో చేరబోతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బలమైన బీసీ నేత పార్టీలో ఉంటే బీసీ ఓట్లకు ఎలాంటి ఢోకా ఉండదని రాష్ట్ర అధినాయకత్వంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2014లో ఎల్బీనగర్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు కృష్ణయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, అనూహ్యంగా ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన వైసీపీ, బీసీ నాయకుడనే ఉద్దేశంతో ఆర్ కృష్ణయ్యకు 2022లో రాజ్యసభ టికెట్‌ ఇచ్చింది. దీంతో ఆయన గత రెండేళ్లుగా రాజ్యసభ వైసీపీ ఎంపీగా కొనసాగుతూ అనూహ్యంగా రాజీనామా చేశారు.

Next Story

Most Viewed